Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18వ తేదీతో ముగిసిన కాలపరిమితి
- నూతన కమిటీ నియామకంపై మీనమేషాలు
- పర్సన్ ఇన్చార్జీని ఏర్పాటు చేయని వైనం
ఈసారి ఎస్సీ మహిళకు చైర్మన్ పీఠం
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరున్న ఖమ్మం మార్కెట్ కమిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఏడాదికోసారి పది మంది సభ్యులతో కమిటీని నియమించాల్సి ఉన్నా ప్రస్తుత పాలకవర్గాన్ని రెండేళ్లపాటు కొనసాగించారు. ఆ పాలకవర్గం పదవీకాలం జూలై 18వ తేదీతో ముగిసినా ఇంకా నూతన కమిటీ ఏర్పాటులో తాత్సారం చోటుచేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా కమిటీ ఏర్పాటు ఆలస్యమైతే పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. కానీ అటువంటిదేమీ లేకపోవడంపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే నూతన కమిటీ నియామకంపై కసరత్తు పూర్తయినట్టు సమాచారం వస్తున్నా ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారో అర్థంకావట్లేదు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ల జాబితాలో వరంగల్ తర్వాత ఖమ్మం మార్కెట్ రెండుస్థానంలో ఉంది. చింతకాని, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలు ఈ మార్కెట్ పరిధిలో ఉన్నాయి...ఉమ్మడి ఖమ్మంతో పాటు చుట్టుపక్క జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి పంట ఉత్పత్తులు తెస్తారు. ఏటా సుమారు రూ.2,000 కోట్లకు పైగా టర్నోవర్ ఉండే ఈ మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి రూ.7 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్ కమిటీలు న్నా ఈ మార్కెట్ పాలకవర్గంలో చోటుకోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం మార్కెట్లు ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేదే పాలకవర్గం ఏర్పాటులో పూర్తి అజామాయిషీ. ఈ మేరకు ఖమ్మం మార్కెట్ కమిటీ నియామకంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ నిర్ణయమే ఫైనల్. ఇప్పటికే మంత్రి దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసి పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. అయినా జాప్యం జరుగుతుండటం చర్చనీ యాంశంగా మారింది.
మంత్రి సిఫారసు ఏమైంది?
మార్కెట్ పాలకవర్గం నియామకం విషయంలో ఇప్పటికే మంత్రి అజరుకుమార్ ప్రభుత్వానికి సిఫారసు చేశారని సమాచారం. గతంలో రెండేళ్లకోసారి మార్కెట్ కమిటీని నియమించేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదికోసారి నియమిస్తోంది. పైగా చైర్మన్ పదవి విషయంలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. రొటేషన్ పద్ధతిలో ఈసారి ఎస్సీ మహిళకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వ్ అయింది. మార్కెట్ పాలకవర్గంలో మొత్తం పది మంది సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరి చొప్పున ఉండాలి. ముగ్గురు రైతులు, ఇద్దరు ట్రేడర్లు, ఒక మహిళ సభ్యులుగా ఉంటారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఏడీ మార్కెటింగ్, ఏడీ అగ్రికల్చర్, మేయర్, సర్పంచ్, ఓ సొసైటీ చైర్మన్లకు చోటు ఉంటుంది. ఈ కూర్పు ప్రకారం ఖమ్మం మార్కెట్ కమిటీ పాలకవర్గానికి సంబంధించిన జాబితాను మంత్రి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.
చైర్మన్ రేసులో లక్ష్మీప్రసన్న?
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానం రొటేషన్‌లో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. రేసులో చర్చికాంపౌండ్‌కు చెందిన లక్ష్మీప్రసన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైస్‌చైర్మన్‌గా కోటపాడు ఉపసర్పంచ్ కొంటెముక్కుల వెంకటేశ్వర్లు ఖాయమైనట్లు తెలుస్తోంది. గతంలో బీసీ (జనరల్) సామాజికవర్గానికి చెందిన ఆర్జేసీ కృష్ణ ఏడాది పాటు చైర్మన్‌గా కొనసాగారు. ఓసీ జనరల్‌కు చెందిన మద్దినేని వెంకటరమణ రెండేళ్లపాటు పదవిలో ఉన్నారు. వాస్తవానికి ఏడాది కాలానికే పదవీకాలం ముగియాల్సి ఉన్నా మద్దినేని వెంకటరమణ పాలకవర్గాన్ని ఆర్నెల్లు, ఆర్నెళ్ల చొప్పున రెండుసార్లు పొడగించారు. ఆ పాలకవర్గం గడువు ఈనెల 18వ తేదీతో ముగిసింది. మరోసారి పదవీకాలాన్ని పొడిగించే అవకాశం లేదు. అనివార్య పరిస్థితుల్లో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులకు కొత్త కమిటీ నియామకం కోసం ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ మంత్రి అనుమతితో త్వరలో పాలకవర్గం ఏర్పాటు అవుతుందని జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఖమ్మంతో పాటు గతకొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్నీ నియమించాల్సి ఉంది.