Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : ఎడతెరిపిలేకుండా మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు కారేపల్లి మండలంలో వాగులు పోంగిపోర్లిపోతున్నాయి. చెరువులు నిండికుండాను తలపిస్తూ అలుగు పడ్డాయి. కారేపల్లి, పేరుపల్లి, మాధారం, తొడితలగూడెం, అలుగుపడగా గాదెపాడు భూపతిరాయుని పెద్దచెరువులు అలుగునీటితో ముత్యాలవాగు కట్టు పొంగి పోర్లిపోతుంది. చిన్నకట్టుగూడెం వద్ద నాగరాజు కట్టు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పేరుపల్లి వద్ద గల లోలెవల్ బ్రిడ్జీ పై నుండి నీరు ప్రవహిస్తుంది. మండలంలో ప్రమాధభరితంగా ఉన్న వాగులు, బ్రిడ్జీలను కారేపల్లి ఎస్సై పీ.సురేష్, ట్రైనీ ఎస్సై వీరప్రసాద్‌లు పర్యవేక్షించారు. ప్రమాదాలు పొంచిఉన్నా, సంభవించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎస్సై సురేష్‌లు కోరారు.
వర్షాలకు కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు
గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
ఎర్రుపాలెం : పెద్ద గోపవరం నుండి భీమవరం గ్రామం వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టి గత రెండు సంవత్సరాలు పైబడి రోడ్డు పనులు పూర్తి చేసినా కల్వర్టు నిర్మాణపు పనులు జాప్యం జరుగుతుడటంతో పనులు త్వరితగతిన పూర్తి కాకపోవడం వలన నిర్మాణానికి ఏర్పాటు చేసిన డ్రైవర్సన్ రోడ్డును వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన డ్రైవర్షన్ రోడ్డు కొట్టుకొని పోవడంతో మామునూరు- అయ్యవారిగూడెం, గ్రామాల మధ్య వాహన రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది చెందుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం పారిననీటి వరద తాకిడికి కొట్టుకుపోయాయి. రెండు చప్టాల నిర్మాణం పూర్తి కాని కారణంగా అయ్యవారిగూడెం, భీమవరం, గుంటుపల్లి, గోపవరం గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేసవి కాలంలో పనులు ప్రారంభించాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వర్షాకాలం ముందు చప్టా నిర్మాణపు పనులు చేపట్టడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యతో గ్రామాల మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరతగతిన కల్వర్టు నిర్మాణపు పనులు పూర్తి చేసి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముక్తకంఠంతో మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు
కొణిజర్ల : గత రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు వాగులు, ఏర్లు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగు, సాలెబంజర, తీగలబంజర గ్రామాల మధ్యలో గల రాళ్ళవాగు, తీగలబంజర,మల్లుపల్లి గ్రామాల సమీపంలో గల పగిడేరు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి వచ్చే వరద ప్రవాహంతో పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పగిడేరు, నిమ్మవాగులు వంతెనపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో పల్లిపాడు, ఏన్కూరు గ్రామాల మధ్య తెల్లవారుఝాము నుంచి రాకపోకలు నిలిచిపోవటంతో జన జీవనం స్తంబించింది. కుండపోత వర్షానికి గ్రామాల్లో వీధులన్నీ చిత్తడి, చిత్తడిగా మారాయి.
రాకపోకలకు అంతరాయం
బోనకల్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రమైన బోనకల్లు లోని స్థానిక ఖమ్మం బస్ స్టాండ్ సెంటర్లో ఇళ్ల మధ్య వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది. మధిర క్రాస్ రోడ్డు నుంచి పెద్ద బీరవల్లి రోడ్డు వర్షపు నీటిలో మునిగి పోయింది. చిన్న బీరవల్లి -రాపల్లి క్రాస్ రోడ్డు మధ్యలో గల చిన్న బీరవల్లి వాగు రోడ్డుకడ్డంగా పొంగి ప్రవహిస్తుంది. ఆళ్లపాడు- గోవిందాపురం ఏ రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలలో లో ఇళ్ల మధ్య వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అనేక గ్రామాలలో అంతర్గత రోడ్లో వర్షపు నీటితో మునిగిపోయాయి. సైడ్ డ్రైనేజీలు వర్షపు నీటితో నిండిపోయాయి. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో వర్షపు నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం బస్టాండ్ సెంటర్లో గల రోడ్డుకు అడ్డంగా ఉన్న ఓ పెద్ద గుంత వర్షపునీరు చేరి ఉండటంతో అక్కడ గుంత ఉన్న విషయం తెలియక అనేక ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురైయ్యాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఖమ్మం బస్టాండ్ సెంటర్లో దాదాపు 80 శాతం వరకు షాపులు మూసి వేశారు. జనజీవన స్రవంతికి ఆటంకంగా మారింది.
గ్రామాలు జలమయం
పెనుబల్లి :మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. లంక సాగర్ ప్రాజెక్ట్ 16 అడుగుల నీటి సామర్థ్యంగాను14 అడుగుల నీటి మట్టంకు చేరింది. నీలాద్రి ప్రాంతాల నుండి వస్తున్న వర్షపునీరు మరింత ప్రాజెక్టులోకి చేరుకొని ఉండడంతో శుక్రవారం సాయంత్రానికి అలుగు పడే అవకాశం ఉంది. సత్తుపల్లి- ఖమ్మం ప్రధాన రహదారి కొత్తలంక పల్లి నూతన వంతెన ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతుండగా వాహనాలు వెళ్లేందుకు పక్కగా మరో రహదారి ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి దారి కొట్టుకుపోవడంతో 24 గంటలుగా వాహనాలు వెళ్లేందుకు అనుకూలించకపోవడంతో వేంసూరు మండలం మీదగా సత్తుపల్లికి వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. లంకసాగర్లో రామాలయం ఎదురుగా ఉన్న 100 ఏళ్ల నాటి మామిడి వృక్షం రోడ్డుపై పడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో లంకపల్లి వద్ద వరదకు రోడ్డు కొట్టుకుపోయి వాహనాలు నిలిచిపోయానే సమాచారంతో పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌లు తమ వాహనంపై రహదారి పైకి రాగానే ఖమ్మం వైపు నుండి వస్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్ వాహనం ఢకొీనడంతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి.
కూసుమంచి- నర్సింహులగూడెం రోడ్డు బంద్
కూసుమంచి: వర్షాలకు ఉదతంగా ప్రవహిస్తున్న వరద నీరు రావడం వల్ల మండలంలోని కూసుమంచి- నర్సింహులు గూడెం గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై గురువారం సీఐ సతీస్, ఎస్ఐ నందీఫ్లు రాకపోకలను నిలిపివేశారు.
దానవాయిగూడెం కాలనీ జలమయం
ఖమ్మం : నగరానికి కూతవేటు దూరంలో ఉన్న 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీలో రోడ్ నెంబర్ 6,7,8,9 లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాల్వలు లేక కొద్దీ పాటివర్షంకు కాలనీ అంత జలమయం అవుతుందని కాలనీవాసులు వాపోతున్నారు. డివిజన్లో చాలా చోట్ల రోడ్లు కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పోరేటర్ ఆ ప్రాంతాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు : కలెక్టర్
గాంధీచౌక్ : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలకు గాను కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విపి.గౌతమ్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో రెండురోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించిందని, ఏదైనా సమస్య ఉంటే సత్వరమే 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి అవసరమైన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో 24 గంటలు నిరంతరాయంగా టోల్ ఫ్రీ నెంబరు కాల్ సెంటర్ పనిచేస్తుందని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహాయక చర్యలకై సంప్రదించగలరని కలెక్టర్ తెలిపారు.
నిండిన చెరువులు..నిలిచిన రాకపోకలు
కల్లూరు : ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పడే వరకు చేరాయి. గురువారం ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ వచ్చారు. కల్లూరు పెద్ద చెరువు అలుగు పొంగి ప్రవహిస్తూండటంతో కల్లూరు, లక్ష్మీపురం గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసు సిబ్బంది అప్రమత్తతంగా ఉంటు ఇతర శాఖా అదికారులతో సమన్వయగా కలసి పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏసీపీ ఎన్ వెంకటేష్, సత్తుపల్లి రూరల్ సిఐ కరుణాకర్, ఎస్ఐ శ్వేత ఉన్నారు.
లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మేయర్
గాంధీచౌక్ :గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మంనగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను మేయర్ పి.నీరజ, ఉపమేయర్ ఫాతిమా జోహారాలు గురువారం పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి సహాయ సహకారాలు అందిస్తామని అందుబాటులో అధికారులు ఉంటారని మేయర్ అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు పొంగి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ అన్నారు. పై నుండి వస్తున్న వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల మున్నేరు ముంపు ప్రాంతాలలో బొక్కల గడ్డ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. మున్నేరు, లకారం చెరువు ముంపు ప్రాంతాలలో ఫ్లడ్లైట్స్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్, కర్నాటి కృష్ణ, 47వ డివిజన్ కార్పొరేటర్ మాటేటి అరుణ, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీ, అర్బన్ తహశీల్దార్ ఎం.శైలజ, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, వన్ టౌన్ సీఐ చిట్టి బాబు, సుడా డైరక్టర్ ముక్తర్, ఆర్ఐ రాజేష్, రవి, టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మాటేటి కిరణ్ కుమార్, సాయికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
వాన ముసురుతో జనజీవనం అతలాకుతలం
ముదిగొండ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతూ బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పలుగ్రామాలలో రోడ్లన్నీ చిత్తడిగా మారి దర్శనమిస్తున్నాయి. ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి మధ్య ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
నల్ల చెరువు పరవళ్ళు
వైరా: వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం నల్లచెరువు నిండి అలుగువాగు పొంగి పరవళ్ళు తొక్కుతుంది. సుమారు 300యకరాలకు సాగు నీరు అందిస్తున్న ఈ చెరువు కు కొణిజర్ల మండల పరిధిలోని పల్లిపాడు,దుద్దేపుడి గ్రామాల నుండి కొంత నీరు వచ్చి చేరుతుంది.తుఫాన్ ప్రభావం తో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి అలుగుల పై నుండి వరద ఉదతంగా ప్రవహిస్తుంది.ఆలుగువాగు ప్రక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీ లో సగభాగం నీటమునిగి నిరుపేదలు రోడ్డున పడ్డారు. మరో వైపు వైరా ప్రాజెక్ట్ నిండి ఆలుగుల నుండి వరద భారీగా కష్ణానదికి వెళుతుంది. ఏటి ఒడ్డున గల స్నానాల లక్ష్మీ పురం, ముసలిమడుగు గ్రామాలకు వరద ముప్పు ఉంటుంది. మండల అభివద్ధి అధికారి ఎన్ వెంకట పతి రాజు ఎంపీఓ,పంచాయతీ కార్యదర్శులతో ఆ గ్రామాలలో పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇటువంటి వరద సమయాలలో ఈ రెండు గ్రామాల లో లోతట్టు ప్రాంతాల వారిని పోలీస్ సహాయం తో వైరాకు తరలించి పాఠశాలల్లో,ఫంక్షన్ హాళ్ళలో ఉంచి భోజన ,వసతులు కల్పించడం జరుగుతుంది. గురువారం రాత్రి కూడా వైరా ప్రాజెక్ట్ క్యాచ్చ్ మెంట్ ఏరియా లో భారీ వర్షాలు కురిస్తే శుక్రవారం లక్ష్మి పురం,ముసలి మడుగు గ్రామాల ప్రజలను వైరాకు తరలించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందిరమ్మ కాలనీ లో సగం కుటుంబాలను సోమవరం నల్ల చెరువు వరదనుండి ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించ వలసి ఉన్నది.