Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ వైద్యాధికారు లను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం కలెక్టర్ సందర్శించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం, కోవిడ్ వార్డు, ఆర్.టి.పి.సి.ఆర్ కేంద్రం, తెలంగాణ డయాగస్టిక్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ప్రసూతి విభాగం, ఆపరేషన్ థీయోటర్, ఓ.పి విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆర్.టి.పి.సి.ఆర్ కేంద్రం ద్వారా అందించనున్న వైద్య పరీక్షల విభాగాలను పరిశీలించారు. అదేవిధంగా కోవిడ్-19 వార్డును కలెక్టరేట్ పరిశీలించి పాజిటివ్ పేషెంట్లతో వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోజువారి ప్రసవాల సంఖ్య, చిన్న పిల్లల వైద్యసేవలు, గైనకాలజిస్ట్ వైద్యులు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది యొక్క విధుల వేళలను అదేవిధంగా కోవిడ్ వార్డులో ఆక్సిజన్ బెడ్స్, అసుపత్రిలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కోవిడ్ వార్డులో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పాజిటీవ్ పేషెంట్ల వివరాలను ఆసుపత్రి సూపరింటిండెంట్ జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండాలని, ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ డాక్టర్ శ్రీనివాసరావు, గైనకాలజిస్టు డాక్టర్ కృపా ఉషశ్రీ, ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.