Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులందరూ తమ కార్యస్థానాలలో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండాముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా మండలాలు, జిల్లాస్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాగల 48 గంటలలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులందరూ తమ కార్యస్థానాలలో ఉండి విధులు నిర్వహించాలన్నారు. చెరువులు, కుంటలు, రోడ్లు తెగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ, వరద ప్రభావం వల్ల పెరిగే నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల పొంగిపొర్లుతున్న వాగులు, వంతెనలు, రోడ్లపై నుండి ప్రజల ప్రయాణాలు కొనసాగించకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వనరులను సిద్ధంగా ఉంచాలన్నారు రెస్క్యూ బంధాలు, విద్యుత్ అంతరాయ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం కల్గిన ప్రాంతాలలో వరద ప్రవాహం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో భారీ వర్షాలతో ఎటువంటి నష్టం జరగకుండా స్టేషన్ హాజ్ అధికారులను అప్రమత్తం చేశామని పోలీసు కమిషనర్ విష్ణు.యస్.వారియర్ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, అగ్నిమాపక ఇతర అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు చెప్పారు. వరదనీటి ఉధతి ఉన్న 16 చోట్ల ప్రయాణాలు రద్దు చేశామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు శంకర్ నాయక్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, ఎం.పి.డి.ఓలు, తదితరులు పాల్గొన్నారు