Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర విచారణ జరపాలి
- అమిత్‌షాను మంత్రి పదవి నుండి తొలగించాలి
- సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- సోషల్ మీడియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన
నవతెలంగాణ-ఖమ్మం
పెగాసస్ స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధమని, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సోషల్ మీడియా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సోషల్ మీడియా వింగ్ జిల్లా నాయకులు ఎస్.నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ఇతరులపై నిఘా పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థతో పాటు దేశ భద్రతలపై తీవ్రమైన దాడి అని తెలిపారు. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టుకోవాలనే కోరికకు సంబంధించింది కాదనీ, సొంత ఆలోచనలతో కూడిన భావాలనీ, అవి వేరొకరి ప్రయోజనాలకు సాధనం కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం కేవలం సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదనీ, ఒక వ్యక్తి మొత్తం జీవితానికి సంబంధించిన డిజిటల్ ఇంప్రింట్‌ను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఫోన్ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండే వారందరి గురించి తెలుసుకోవడానికి దారి తీస్తుందని వివరించారు. మోడీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సంస్థలు దెబ్బ తింటున్నాయన్నీ అన్నారు. యు.ఎ.పి.ఎ మాదిరిగా, బీమా కోరెగావ్ కేసులోని నిందితుల కంప్యూటర్లను హ్యాక్ చేసి అందులో మాల్వేర్ను పెట్టేందుకు...బెదిరించడానికి, జైలు శిక్ష విధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర సంస్థలను ఉపయోగించినట్లుగా.. .ప్రత్యర్ధులపై పెగాసస్‌ను సైబర్ ఆయుధంగా ఉపయోగిస్తున్నారన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం వాడుకోవడం దారుణమన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి అమిత్ షా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వై. విక్రమ్, జిల్లా నాయకులు భూక్య వీరభద్రం, పి.ఝాన్సీ, నందిపాటి మనోహర్, తుమ్ము విష్ణువర్ధన్, మెరుగు సత్యనారాయణ, మేకల నాగేశ్వరరావు, నర్రా రమేష్, కాంపాటి వెంకన్న, జీడి కుంట్ల వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.