Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ మండలాల్లో పర్యటించన అధికారులు
నవతెలంగాణ పినపాక
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతం, ఇతర గ్రామాల ప్రజలు గోదావరి నది, చెరువులు, కుంటలు, వాగులు పొంగే అవకాశం ఉన్నందున ఎవరూ చేపలవేటకు వెళ్లరాదని తహసీల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
మండలంలోని టీ కొత్తగూడెం పరిధిలో గత గోదావరి పరివాహక ప్రాంతాలలో తహసీల్దార్ విక్రమ్ కుమార్ పర్యటించారు. గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. ముంపు ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడారు. అత్యవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. విద్యుత్ కలెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట సీఐ దోమల రమేష్, ఎస్ఐ టీవీఆర్. సూరి, జడ్పీటీసీ సుభద్రాదేవి, వాసు బాబు, సర్పంచ్ చిన్నక్క రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక తహశీల్దార్ సాదియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక తహసీల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహశీల్దార్ మాట్లాడుతూ.. మండలంలో ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, చేపల వేటకు, ఈతకు చెరువులకు, వాగులకు వెళ్లొద్దని సూచించారు. అదే విధంగా రోడ్లపై లో లెవల్ బ్రిడ్జిలు ఉన్న చోట ఎవరూ దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అందులో భాగంగా నేడు రాయిపాడు, రాయిగూడెం, పాతూరు, సీతానగరం, తదితర గ్రామాల సమీపంలో కిన్నెరసాని, జల్లేరు, ఇతర వాగుల వరధ ఉధృతి పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా తహసీల్ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
టేకులపల్లి : ప్రజల రక్షణే పోలీసుల విధి నిర్వహణ లక్ష్యమని సీఐ బానోత్ రాజు, ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్లు అభిప్రాయపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎడ తెరపి లేకుండా వర్షాలు కురుస్తునందున్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తల్లాడ : మండల పరిధిలోని గొల్లగూడెం రంగాపురం గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ గత రెండు రోజులుగా కురిన వర్షానికి కొట్టుకుపోయింది. తహసీల్దార్ గంట శ్రీలత, ఎంపీడీవో బి.రవీందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
సారపాక : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ భగవాన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో బూర్గంపాడు కస్తూరిగాంధీ బాలిక పాఠశాల, ఐటీసీ పాఠశాల నందు శుక్రవారం పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 52 అడుగులకు చేరే అవకాశం ఉందని సారపాక, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె, ఇరవెండి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ గ్రామాలలో తక్షణమే పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
బూర్గంపాడు : బూర్గంపాడు మండలం ఉప్పుసాక పంచాయతీ పరిధిలోని జిన్నగట్ట గ్రామంలో శుక్రవారం ఎస్ఐ ఎస్.జితేందర్ పర్యటించారు. కిన్నెరసాని వాగు, వరదల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రతాలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సలహాలు,సూచనలు ఇచ్చారు.