Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలి
- ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి, అత్యవసర సహాయం కొరకు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, కాలువలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పోలీసుల సహాయం కోసం వెంటనే డయల్ 100కు ఫోన్ చేసే విధంగా పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కలిపించాలని సూచించారు. ఇతర శాఖల సమన్వయంతో ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అండగా ఉండాలని కోరారు. అనంతరం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గుట్కా, మట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్, మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్,ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు,ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ సిఐ రమేష్‌లు పాల్గోన్నారు.