Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరకొరగా వ్యాక్సిన్ సరఫరా
- వ్యాక్సిన్ కోసం జనం ఎదురుచూపు
నవతెలంగాణ-బోనకల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకగా నడుస్తుంది. రెండో దశలో కరోనా వేగంగా బోనకల్లు మండలంలోని 22 గ్రామాలకు విస్తరించింది. రెండవ దశలో బోనకల్లు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మార్చి నెల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ప్రారంభం అయినప్పటికీ మండల ప్రజలు తొలుత ఆసక్తి చూపలేదు. పైగా కరోనా టెస్టుల కోసం కూడా ప్రజలు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన మార్చి నెల చివరి వరకు దాదాపు ఎక్కువ రోజులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు రాకపోవటంతో ప్రజల కోసం గంటల కొద్దీ వైద్య సిబ్బంది వేచి ఉన్నారు. ఏప్రిల్ నుంచి వ్యాక్సిన్ కోసం, టెస్టుల కోసం జనం పరుగులు తీశారు. చివరకు పరిస్థితి ఎలా ఉందంటే వ్యాక్సిన్ కోసం తెల్లవారుజామున 5 గంటలకే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి క్యూలో చెప్పులు పెట్టేవారు. మే నెల నుంచి జనం తాకిడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వ్యాక్సిన్ కోసం వచ్చేవారు, టెస్టుల కోసం వచ్చే జనం తో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కళకళలాడేది. ప్రతిరోజు సుమారు 150 నుంచి 250 మంది ప్రజలు వ్యాక్సిన్ లేక ఖాళీగా తిరిగి ఇంటికి వెళ్ళేవారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ ఆచరణలో అది అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. కానీ అది అమలు కాలేదు. బోనకల్ మండలంలో నేటి వరకు 6,754 మందికి మాత్రమే మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు.1,592 మందికి మాత్రమే రెండవ డోసు వేశారు. మండల జనాభా 43 వేల 909 మంది ఉన్నారు. మండలంలో రెండో దశలో 1856 కరోనా కేసులు నమోదయ్యాయి. నేటికీ ఇంకా 46 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ 46 మంది హౌమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వం ఒక్కొక్క రోజు 100 మరొక రోజు 150 డోసులను మాత్రమే సరఫరా చేస్తుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు పది రోజులుగా మండల పరిషత్ ఆధ్వర్యంలో బోనకల్లు ఉన్నత పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిలో సగం మంది వ్యాక్సిన్ లేక తీవ్ర నిరాశ నిస్పహలతో వెళ్ళిపోతున్నారు. గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ టోకెన్ల కోసం మహిళలు, పురుషులు తోపులాట కు దిగి ఘర్షణ పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న జోరు వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కోసం జనం వచ్చారు. వ్యాక్సిన్ కోసం జనం వస్తున్నా ప్రభుత్వం మాత్రం అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదు. ఏదో తూతూమంత్రంగా ప్రతిరోజు 100 నుంచి 150 డోసులు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. మొత్తంమీద మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక నడుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి రోజు 1000 నుంచి 1500 వరకు డోసులు సరఫరా చేయాలని మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.