Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు గోదావరి ప్రవాహం 43 అడుగులు దాటే అవకాశం
- వరదలు, వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
- పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
- భద్రాచలంలో రివ్యూ సమావేశంలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. శుక్రవారం భద్రాచలం సబ్ కలెక్టరేట్లో వర్షాలు-ప్రమాదాల నివారణ, హరిత హారంపై కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి పువ్వాడ హాజరై మాట్లాడారు. తొలుత భద్రాచలం బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఎగువ నుండి భారీగా వరద దిగువకు వస్తుందని అన్నారు. వచ్చే ఏడు గంటల తరువాత ప్రస్తుతం ఉన్న ఉధృతి రెట్టింపు వరద తీవ్రత ఉండనుందని చెప్పారు. గడిచిన మూడు రోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, పడాల్సిన దానికంటే అధికంగా వర్షపాతం నమోదు అయిందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఎక్కడా, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. వీలైతే ఎక్కడికక్కడే ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి, మలేరియా, డెంగ్యూ, ఇతర విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు చేపట్టాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. కురుస్తున్న భారీ వర్షానికి ప్రతి గ్రామాల్లో చెరువులు, నిండు కుండలను తలపిస్తున్నాయని అన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని, అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, వాతావరణ శాఖ చెబుతున్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, ఇక ముందు కూడా జరగకుండా చూడాలన్నారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు పిలుపు ఇవ్వడం ప్రజాహితం కోసం చేసినందున హరిత హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్లు వేలాడకుండా, ప్రమాదం కలిగించే విధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా ప్రస్తుతం 22.30 అడుగులు ఉందని మంత్రి తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఈ రాత్రి నుండే మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికలు వచ్చే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్ అనుదీప్‌ని నేటి రాత్రి భద్రాచలంలోనే బస చేస్తారని ప్రభుత్వం తరఫున ఆదేశించారు. రాత్రి నుండి ప్రమాద హెచ్చరికలు ఇచ్చే పరిస్థితులు ఉన్నందున అన్ని శాఖల అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రానున్న విపత్తిని ఎదుర్కొనెందుకు సిద్ధంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం, ఆశ్వారావు పేట ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, ఎస్పీ సునీల్ దత్, పీిఓ గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.