Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం
- కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం వద్ద వరద గోదావరి పరవళ్లుతొక్కుతోంది...ఎగువ భాగాన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. క్రమేపీ గోదావరి వరద భద్రాచలం వద్ద పెరగటంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 19.4 అడుగులు ఉన్న గోదావరి 9 గంటలకు 20.3 అడుగులు, 12 గంటలకు 21.3అడుగులు, మధ్యాహ్నం 3 గంటలకు 23 అడుగులకు గోదావరి చేరుకుంది. అదే విధంగా సాయంత్రం 6 గంటలకు 26.5 అడుగులకు గోదావరి చేరుకుంది. ఏడు గంటలకు 27.9 అడుగులకు గోదావరి వరద ప్రవహిస్తోంది. కేవలం 48 గంటల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్ నెంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు .08744-421950, 08743-232444 కంట్రోల్ రూమ్ నెంబర్ లను అధికారులు ఏర్పాటు చేశారు.
మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం..
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయంకి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటే అవకాశముందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పేర్కొన్నారు. మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని అధికారులు పేర్కొనడంతో మొదటి ప్రమాద హెచ్చరిక దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రావతి నుంచి వచ్చిన ప్రవాహంతో తుపాకులగూడెం వద్ద నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాలిపేరు నుంచి వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి 52 నుంచి 53 అడుగులకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో భయం భయం..
భద్రాచలం వద్ద వరద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికార యంత్రాంగం పేర్కొనడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి ప్ర వహించే అవకాశాలు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో భద్రాచలం, బూర్గంపాడు సారపాక, రెడ్డిపాలెం,ఇది వెండి, మోతే, పాత సారపాక తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆయా ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధం చేసి ఆయా ప్రాంతాలలోని వరద బాధితులను తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగమైంది.