Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా మురుగు నీరు విడుదల
- ఆ నీరే 12 మండలాలకు తాగు నీరు
నవతెలంగాణ-వైరా
వ్యవసాయం కంటే మంచినీటికి ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా భావిస్తున్న వైరా ప్రాజెక్ట్‌ను మురుగు నీటి నుండి రక్షించాలని మంచినీటి వాడకం దారులు డిమాండ్ చేస్తున్నారు. వైరా పట్టణ సగభాగం గృహస్థులు వాడిన నీరు మురుగు కాలువల ద్వారా ప్రాజెక్టులో కలుస్తోంది. వర్షాకాలం వస్తే మురుగునీరు, వర్షపు నీరు మంచినీటి ప్రాజెక్ట్ లో కలిసి కలుషితం అవుతున్నది. మునిసిపాలిటీలో 5, 6 వార్డుల వాడకం నీరు నేరుగా వైరా ప్రాజెక్ట్‌లో కలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మిషన్ భగీరథ మంచినీటి పథకం ఏర్పాటు చేసి జిల్లాలో 12 మండలాల మంచినీటి అవసరాలకు నీటిని తరలిస్తున్నారు. కలుషితమైన నీటిని చూస్తున్న ప్రజలు మంచినీరుగా వాడుకోవటానికి భయపడుతున్నారు. అంతే గాక ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియా లో నిర్మించిన అనేక పరిశ్రమల నుండి వ్యర్థాలు కొట్టుకొస్తున్నవి. వాటిని అడిగే వారు అడ్డుకునే వారు లేక పోవటం దౌర్భాగ్యం. వైరా మునిసిపాలిటీగా స్థాయి మాత్రమే పెంచుకున్నది. అంతకు మించి ఏ ఒక్కటీ పెరగలేదని మునిసిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ బత్తుల గీత ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ తక్షణం చేయవలసిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదన్నారు. వైరా ప్రాజెక్టులోకి ప్రతిరోజూ వస్తున్న వ్యర్థాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, నీరు కలుషితం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలో ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన కాలనీలు ఉన్నాయని ఆ ప్రాంతాలలో పక్కా డ్రెయిన్లు నిర్మించి మురుగునీటిని మరోమార్గం గుండా బయటికి పంపాలని మేజర్ గ్రామపంచాయతీ కాలం నుండి డిమాండ్ ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూడాలని, కాని మొక్కలు నాటటమే పట్టణ ప్రగతిగా మారిపోయిందని విమర్శలు వస్తున్నవి.
పట్టణంలో 20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు గ్రహణం పట్టిందని సగం రోడ్లు వేసి సగం రోడ్లకు కంకర తోలి వదిలేశారని,సంవత్సరం క్రితం పూర్తి కావాల్సిన రోడ్ల పనులు నిలిచిపోయి గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నవి.మునిసిపాలిటీ పాలకవర్గం, అధికారులు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించటా నికి సహితం భయపడుతున్నట్టు తెలుస్తుంది. వైరా మునిసిపాలిటీ దీనస్థితిపై జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు స్పందించి స్థాయికి తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.