Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరం నిర్మాణం పై ముందే హెచ్చరించిన సీపీఐ(ఎం)
- ముంపు ప్రాంతాలను పరిశీలించిన తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-భద్రాచలం
ప్రతి ఏటా గోదావరి వరదల వల్ల ముంపునకు గురవుతున్న ప్రాంతాలలో శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం భద్రాచలంలోని గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పార్టీ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం ప్రాంతంలో ఎప్పటికీ 53 అడుగులు గోదావరి ఉంటుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు ముందుగానే సీపీఐ(ఎం) ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే ఈ ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై అప్పటి ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) పేర్కొన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. భద్రాచలం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాలలో వరద బాధితులను తరలించే ప్రాంతాలలో వసతులు, సౌకర్యాలు మరింత మెరుగు పరచాలని ఆయన అన్నారు. భద్రాచలం పట్టణ ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఈ ముంపు నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆయన అన్నారు. అశోక్ నగర్ కొత్త కాలనీ ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక, జిల్లా నాయకులు ఎం.బీ.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.