Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారేపల్లిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబులు సమావేశం
నవతెలంగాణ-కారేపల్లి
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీఐటీయు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాలను చేయనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అన్నారు. ఆదివారం కారేపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాసంఘాల రౌండ్టేబులు సమావేశం సీఐటీయు మండల కార్యదర్శి కే.నరేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రం తీసుకవస్తున్న వ్యవసాయ బిల్లులతో రైతాంగం కార్పొరేట్ శక్తుల చేతులో నలిగి పోనున్నారన్నారు. భూమి, పంటలపై స్వేచ్చను రైతు వదలుకునే పరిస్ధితి దాపురించనుందన్నారు. మార్కెట్లో పెట్టుబడిదారులు ఆధిపత్యం పెరిగి రైతు కూలీగా మారే పరిస్ధితి వ్యవసాయ బిల్లులతో రానుందన్నారు. ఉపాధీ హామీ పధకంలో కులాల వారిగా వేతనాల చెల్లింపు విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోనున్నాయన్నారు. ఈ నెల 25 నుండి ఆగష్టు 9 వరకు దేశవ్యాప్త అందోళనలలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షకార్యదర్శులు వాసిరెడ్డి సంపత్, కే.నాగేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు వజ్జా రామారావు, రైతు సంఘఘం నాయకులు ముండ్ల ఏకాంబరం, దర్గులు, ముక్కా సీతారాములు, సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.