Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధ్య మాటల యుద్ధం ఆసక్తిగా సాగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. జెడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు ప్రభుత్వం ఏర్పడి ఏడూ సంవత్సరాలు తర్వాత ప్రజలకి రేషన్ కార్డులు ఇస్తున్నారని, ఇంకా పలు మండల ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకుడు ఉమ్మనేని బాబు రేషన్ కార్డులు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని, పొట్టకూటి కోసం కొంతమంది వడ్డీలకు తీసుకువచ్చి పాత ట్రాక్టర్లు కొనుగోలు చేశారని, దీంతో రెవెన్యూ అధికారులు వారి రేషన్ కార్డులు తొలగించారని, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా అటువంటి వారి రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ లు తొలగించారని ఫిర్యాదు చేశారు. దీంతో కలకోట ఎంపీటీసీ భర్త యంగల కనకయ్య 30 ఎకరాలు ఉన్న వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చారని ప్రతి విమర్శ కు దిగారు. దీంతో బట్టి కనకయ్యను వివరాలు అడుగుతూ 30 ఎకరాలు ఉన్నవారికి రేషన్ కార్డు ఎలా ఇచ్చారని తహసీల్దార్‌ని బట్టి ప్రశ్నించారు. ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబాల రేషన్ కార్డులను ఎలా ఉంచుతారని లింగాల కమల్ రాజు కౌంటర్ గా మాట్లాడారు. బాబు ఫిర్యాది కి సమాధానంగా నీవు సర్పంచ్ గా ఉన్నావు గా సహాయం చేయవచ్చు కదా అని కమల్ రాజు అనగా వెంటనే బాబు స్పందిస్తూ నేను సర్పంచ్‌గా అనేకమందికి సహాయం చేస్తున్నానని సమాధానం చెప్పడంతో కమల్ రాజు మౌనంగా ఉండిపోయాడు. ఒకే వేదికపై ఉన్న మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉండటంతో హాజరైన అధికారులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. ఒక దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు విమర్శలకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి విమర్శలకు దిగారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాసమస్యలను లేవనెత్తుతుండడటంతో టిఆర్ఎస్ కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. ఒక దశలో బోనకల్ ఎస్ఐ బీ కొండల్ రావు, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య నిలబడి వారించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకర రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని దీని వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ విషయంపై కూడా కమల్ రాజు స్పందిస్తూ ఓ చిన్న సమస్య రాష్ట్ర సమస్యగా రామారావు చెప్పటం బాగా లేదన్నారు. ఈ విధంగా బట్టి విక్రమార్క- కమల్ రాజు, కాంగ్రెస్- టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది. భట్టి విక్రమార్క పలు సమస్యలపై తహసీల్దార్ ప్రశ్నిస్తూ ఉండటంతో కమల్ రాజు తీవ్ర అసహనం గా కనిపించారు.