Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ ఖమ్మం
తీవ్రస్థాయిలో అనారోగ్యాలకు దారితీస్తున్న అంటువ్యాధులకు కారణమైన వైరస్‌లను గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైరల్ పరిశోధన వ్యాధినిర్ధారణ వైరాలజీ ల్యాబోరేటరీ కేంద్రాన్ని జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబోరేటరీను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి సోమవారం మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
వైరస్ జన్యుపరమైన ఉత్పరివర్తనాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను అభివృద్ధి పర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వైరాలజీ ల్యాబోరేటరీని మన జిల్లాకు కేటాయించిందని, దీనితో పాటు అన్ని జిల్లాలకు విస్తరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. వైరాలజీ ల్యాబోరేటరీ కేంద్రంలో అత్యాధునిక పరికరాలను నెలకొల్పడం జరిగిందని, పూర్తి ఆటోమెటెడ్ ఆర్.ఎన్. ఎక్యాక్షన్ మెషిన్, ఆర్.టి.పి.సి.ఆర్ యాంప్లిఫికేషన్ పరికరాలు, బయోసేఫ్టీ క్యాబిన్ వంటి ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వి.ఆర్.డి.ఎల్ కేంద్రం ద్వారా ప్రతిరోజు 6 వందల నుండి 8 వందల నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, వైరాలజీ ల్యాబరేటరీ బాధ్యులు డాక్టర్ సందీప్, సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.