Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధ ప్రాతిపదికన కరకట్ట ఎత్తు పెంచాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం వల్ల భద్రాచలం పట్టణానికి కలిగిన ముంపుపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు నోరువిప్పి నిజాలు చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అశోక్ నగర్ కొత్త కాలనీలో సోమవారం జరిగిన శాఖ ఆరో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోలవరం వల్ల భద్రాచలం డివిజన్లో గిరిజన జాతికి జరిగే నష్టంపై సీపీఐ(ఎం) 2006లోనే ఉద్యమం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని వై.యస్.రాజశేఖర్ రెడ్డి తుపాకులతో అణిచి వేయాలని ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆ రోజు సీపీఐ(ఎం)పై రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టినాయని ఆయన విమర్శించారు. అన్ని పక్షాలు సీపీఐ(ఎం)తో కలిసి ఉద్యమించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. ఇకనైనా పోలవరంపై అన్ని పక్షాలు కలిసి ఉద్యమించి ముంపు నుండి భద్రాచలంను కాపాడే మార్గాన్ని చూడాలని ఆయన పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన కరకట్ట ఎత్తు పెంచి కొంతవరకు నష్టం నివారించాలని ఆయన సూచించారు. అదేవిధంగా తప్పనిసరి ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని నిర్వాసిత ప్రాంతంగా ప్రకటించి పునరావాసం కల్పించి ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ నివాస ప్రాంతాలపై ఉన్న 33/11 కేవీలైన్ని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నర్సారెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకట రెడ్డి, వార్డు కన్వీనర్ పి.సంతోష్ కుమార్, శ్రీను, సతీష్ బాబు, జయ వెంకటరమణ, సత్యవతి, సరోజిని, రమణ, కళావతి మునేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.