Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-బోనకల్
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఉలిక్కిపాటు ఎందుకని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ తహసీల్దార్ రావూరి రాధిక అధ్యక్షతన సోమవారం జరిగింది. మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు లబ్ధిదారులకు రేషన్ కార్డులను సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం సహజమని, దీనిని కూడా ప్రభుత్వంపై విమర్శలుగా భావిస్తే వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్టేనని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల నుంచి ఆసరా పెన్షన్ రావడం లేదని అనేక మంది లబ్ధిదారులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. గతంలో మండలంలో రైతుల భూముల నుంచి కాలవలు, రోడ్లు వేశారని అటువంటి వాటిని నేడు బ్లాక్ లో ప్రభుత్వం పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని తాను శాసనసభలో ప్రస్తావిస్తానని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం పని చేస్తోంది : జడ్పీ చైర్మన్ కమల రాజు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుందన్నారు. పనులన్ని ఒక్కసారే పరిష్కారం కావని దశలవారీగా పరిష్కారం చేపడతాయని అన్నారు. జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు పలు సమస్యలను లేవనెత్తడంతో కమల్ రాజు తీవ్రంగా స్పందించారు. ప్రజాసమస్యలు ఒక్కసారే పరిష్కారం కావని ఈ వేదిక మీద ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు వైస్ చైర్మన్ జంగా రవి కుమార్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జెడ్పిటిసి మోదుగ సుధీర్ బాబు, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ సంగు శ్వేత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.