Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి భూములు మరొకరు పేరుతో నమోదు
- మరలా రిజిస్ట్రేషనే ఏకైక మార్గం
నవతెలంగాణ-బోనకల్
రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదంతో రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2016లో సాదాబైనామాలో బాగంగా దరఖాస్తులను సేకరించింది. ఈ క్రమంలో కొందరు అధికారులు, వీఆర్వోల నిర్లక్ష్యం వల్ల కొంతమంది రైతుల భూముల వివరాలను మరొకరి పేరు మీద ఎక్కించటంతో ఏళ్ల తరబడి రైతుబంధు, రైతు బీమా కోల్పోతున్నారు. కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధిత రైతులు విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
మండల కేంద్రానికి చెందిన మరీదు అప్పయ్యకు గ్రామంలో 175/బి5 సర్వేనెంబర్లో ఒక ఎకరం భూమిని 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. 209/డి4 సర్వే నంబర్లో 15 కుంటల భూమి వారసత్వంగా వచ్చింది. అప్పయ్యకు 186 ఖాతా నెంబరు టి26010150069 పట్టాదారు పాసు పుస్తకము కూడా ఉంది. ఈ పుస్తకంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని ఆ రైతు ఎంతో సంబరపడ్డాడు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలబడలేదు. సహచర రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం డబ్బులు వస్తున్నాయి. తనకు మాత్రం రాకపోవడంతో మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించాడు. మీ భూమి వెంకట అప్పారావు పేరు మీద నమోదయిందని చెప్పటంతో అప్పయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆధార్ నెంబర్ మాత్రం అప్పయ్యదే కావడం విశేషం. అంతేకాకుండా అప్పయ్య భూమికి సంబంధించి టి26010150051 నెంబర్ పాసు బుక్కుతో వేరే వ్యక్తిని హక్కుదారుగా చేశారు.
బోనకల్ గ్రామానికే చెందిన గూగులోతు స్వామి అనే గిరిజన రైతుకు చెందిన రెండు ఎకరాల భూమి వేరే వ్యక్తుల పేరిట నమోదు కావడంతో వారిని కలిసి తిరిగి తనకు తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రాధేయ పడుతున్నాడు.
ఆళ్లపాడు గ్రామానికి చెందిన అల్లిక రాములు భూమిని కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన నరమనేని వెంకమ్మకు రెవెన్యూ అధికారులు పాసుపుస్తకం ఇచ్చారు. అదే గ్రామంలోనే పారా వెంకటేశ్వరరావు, గుడిద నాగేశ్వరరావు, మర్రి నరసయ్య, చెన్నకేశవ అనూష, మరీదు శ్రీను, అల్లిక లక్ష్మీనారాయణ, మంద రామయ్యల తో పాటు పలువురి రైతుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదు. ఆయా గ్రామాలలో నాడు పనిచేసిన అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపమైంది. తమ భూమిని తన పేరుపై ఎక్కించారని రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు.
రిజిస్ట్రేషనే మార్గం అంటున్న అధికారులు
తమ భూములను వేరే వ్యక్తుల పేరు మీదుగా ఎలా నమోదు చేశారని బాధిత రైతులు అధికారులను నిలదీయగా ప్రస్తుతం తమ చేతిలో ఏమీ లేదని ఏమీ చేయలేమని కూడా చేతులెత్తేస్తున్నారు. ఎవరి పేరు మీద అయితే పొలం నమోదు అయి ఉందో వారితో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమేనని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.