Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు... వారి స్తూపం నిర్మాణానికి స్థలం ఇవ్వలేరా
- స్మారక స్థూపాలకు స్థలం కేటాయించే వరకు ఆందోళన కొనసాగిస్తాం
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
ఏజెన్సీ ముద్దుబిడ్డలు భద్రాచలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు కామ్రేడ్ కుంజా బొజ్జి, కామ్రేడ్ సున్నం రాజయ్యల స్మారక స్థూపం నిర్మాణాలను అధికారులు కూల్చివేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు తీవ్రంగా ఖండించారు. కూల్చిన స్థూపం నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో కామ్రేడ్ కుంజా బొజ్జి మూడు పర్యాయాలు, కామ్రేడ్ సున్నం రాజయ్య మూడు పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికై భద్రాచలం నియోజకవర్గ పరిధిలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. నిస్వార్థంగా నిజాయితీగా ప్రజా సమస్యలపై పనిచేసిన మచ్చలేని మహనీయులు వారు అని అన్నారు. ఆగస్టు 3వ తేదీ కామ్రేడ్ సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సందర్భంగా కుంజా బొజ్జి, రాజయ్యల స్మారక స్థూపాలు నిర్మాణం చేస్తుండగా పర్మిషన్ లేదు అనే పేరుతో అధికారులు అడ్డుకొని కూల్చివేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా అనేక కట్టడాలు జరుగుతున్నా ఏమీ చేయలేని అధికారులు ఆదివాసి ముద్దుబిడ్డల స్మారక స్థూపం నిర్మాణాలు అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. స్థూపాల నిర్మాణాలను అడ్డుకోవడం గిరిజన జాతి హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన గిరిజన నాయకులను అవమానపరచడమే అని ఆయన విమర్శించారు. 5వ షెడ్యూల్ అమల్లో ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతరులతో సమానం అని గిరిజన నాయకులు స్థూప నిర్మాణం అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. ఆదివాసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల స్మారక స్థూపాలు నిర్మాణాలను అడ్డుకొని, కూల్చి వేసిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే మాజీ ఎమ్మెల్యేల స్మారక స్థూపం నిర్మాణాలకు స్థలం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యం.రేణుక, ఎం.బీ. నరసారెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు బి.కుసుమ, సున్నం గంగా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.