Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల గత రెండు దశాబ్దాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వైరా ప్రభుత్వ వైద్యశాలను అభివద్ధి చేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
మూడు నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం
వైరా ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయడం వలన మూడు నియోజకవర్గాలలోని పేద, మద్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు, ఎన్కూర్, వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాలు, సత్తుపల్లి నియోజక వర్గంలోని కల్లూరు, తల్లాడ మండలాలు, మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని మండలాల లోని మహిళలు, వృద్ధులు, పిల్లులు, పేద, మద్యతరగతి ప్రజలకు చాల ఉపయోగకరంగా ఉంటుంది.
నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ శిలాఫలకం
8 పడకలు గల వైరా ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అఫ్ గ్రేడ్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వంలోని రోడ్లు, భవనముల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 27 ఫిబ్రవరి 2004న శంకుస్థాపన చేశారు. కాని ఆసుపత్రిని నిర్మించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆసుపత్రిని నిర్మించలేదు. 17 సంవత్సరాలుగా టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా శిధిలావస్థలో ఉన్న శిలాఫలకం నిలుస్తోంది.
కరోనా విజృంభణ కాలంలో ప్రయివేటు ఆసుపత్రులలో దోపిడీ పెరిగింది. ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కలేదు. ప్రభుత్వ వైద్యం ప్రాధాన్యత, ఆవశ్యకత పెరిగింది. వైరా నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఫలితంగా అన్ని రకాల వైద్య సేవలు పేద మద్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. డెలివరీలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో వైద్య సేవలు అందక చనిపోతున్న సందర్భాలున్నాయి. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైరా నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
వైరాలో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి
బొంతు రాంబాబు, సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు.
వైరా నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని సిపిఐ(ఎం) పార్టీ పోరాడుతుంది. కరోనా విజృంభణ వలన ప్రభుత్వ వైద్యం ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర ప్రభుత్వ వైద్యశాలలను వంద పడకల ఆసుపత్రులుగా ఆఫ్ గ్రేడ్ చేసి, వైరా ప్రభుత్వ వైద్యశాలను ఆఫ్ గ్రేడ్ చేయకుండా 8 పడకల ఆసుపత్రిగా ఉంచటం సరైనదని కాదు. వైరా నియోజకవర్గ పరిధిలో అధికంగా ఉన్న గిరిజనులు, దళితులు, పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.