Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల తీరుపై ధ్వజమెత్తిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో సేకరించిన చెత్తను కామంచికల్ తరలిస్తున్నారు. దుర్వాసన, అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజులపాటు చెత్త బండ్లు నిలిపివేయడంతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని చెత్త తిప్పలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం నగరంలోని దాన్వాయి గూడెంలో రూ.1.32 కోట్లతో నిర్మించిన మినీ ట్రాన్స్ఫర్ సెంటర్‌ను మంగళవారం ఆ పార్టీ నాయకులు సందర్శించారు. రూ.కోట్లతో ఇక్కడ ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా ఉండటంపై ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చెత్త విషయంలోనూ చిత్తశుద్ధి లేని ఖమ్మం నగర కార్పొరేషన్ పాలకుల తీరుపై ధ్వజమెత్తారు. ప్రారంభించిన నెలరోజులకే మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిలిపివేయడంపై మండిపడ్డారు. కామంచికల్‌లో మూడు గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నగరంలో చెత్త తరలించకపోవడాన్ని తప్పుబట్టారు. ఇళ్లు, అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున చెత్త నిల్వలు పేరుకుపోయాయన్నారు. పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించి మంగళవారం కొన్ని డివిజన్లలోని చెత్తను దానవాయిగూడెం డంపింగ్‌యార్డుకు తరలించారని తెలిపారు. మరికొన్ని డివిజన్లలో చెత్తను మున్నేరు ఒడ్డున పడేస్తుండటంతో ఆ నీరు కలుషితం అవుతుందని ధ్వజమెత్తారు. తిరిగి ఈ నీటినే శుద్ధి చేసి మిషన్ భగీరథ పథకానికి ఉపయోగి స్తుండటాన్ని తప్పుబట్టారు. గత కొద్దిరోజులుగా నగరంలోని చెత్త తరలింపు విషయంలో అవాంతరాలు తలెత్తుతున్నా...పారిశుద్ధ్యంపై చిత్తశుద్ధి లేని పాలకుల తీరును ఆక్షేపించారు. చెత్త తరలింపు విషయంలో నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. దానవాయిగూడెం డంపింగ్‌యార్డును సందర్శించిన సీపీఐ(ఎం) నేతల్లో టూ, వన్ టౌన్ సెక్రటరీ వై.విక్రమ్, ఎంఏ జబ్బార్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్, రఘునాథపాలెం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.