Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల ప్రచారం ఘనం- ఆచరణ శూన్యం లాభసాటిగా పామాయిల్ సాగు
నవతెలంగాణ- బోనకల్
పామాయిల్ సాగు లాభసాటిగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు మండలంలో విస్తతంగా ప్రచారం నిర్వహించడంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. మండలంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 ఎకరాలకు మాత్రమే పంట సాగుకు అనుమతి ఇవ్వగా 58 ఎకరాలలో సాగు కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ మొక్కల కేంద్రంగా ఉంది అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం దమ్మపేట మండలం అప్పారావుపేట నుంచి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం జరుగుతుంది. నారం వారి గూడెం అప్పారావుపేట కేంద్రాలకు అతి చిన్న మొక్కలు మలేషియా, కోస్తారిక దేశాల నుంచి మన రాష్ట్రంలోకి దిగుమతి అవుతున్నాయి. ఈ మొక్కలు విమానాల, సముద్ర మార్గం నుంచి షిప్ ల ద్వారా మన రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ఆ దేశాల నుంచి మన రాష్ట్రంలోకి మొక్కలు దిగుమతి ఖర్చు ఒక్కొక్క మొక్కకు 80 రూపాయల చొప్పున ఖర్చు వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ చిన్న మొక్కలను అశ్వరావుపేట, దమ్మపేట మండల కేంద్రాలలో గల నర్సరీలలో పెంచుతున్నారు. ఒక సంవత్సరం పాటు ఈ మొక్కలను నర్సరీలో పెంచి, ఆ తర్వాత రైతులకు సబ్సిడీపై మొక్కలను సరఫరా చేస్తారు. ఈ నర్సరీలో మొక్కలు పెంచడానికి పెద్ద ఎత్తున ఖర్చు వస్తోంది. అయినా పామాయిల్ సాగు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు మొక్కలన పంపిణీ చేస్తోంది. ఒక్కొక్క మొక్క ధర 117 రూపాయలు గా నిర్ణయించారు. కానీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు అభివద్ధి చెందాలని ఉద్దేశంతో ఒక్కొక్క మొక్కను రైతుకు కేవలం ముప్పై మూడు రూపాయలకు మాత్రమే సబ్సిడీపై అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క మొక్కకు రైతుకు 84 రూపాయలు సబ్సిడీ ఇస్తుది. అదేవిధంగా ఒక హెక్టారు కి 30 వేల రూపాయలు పెట్టుబడి కోసం సబ్సిడీపై అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఎరువుల కోసం ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం అందజేస్తోంది. పామాయిల్ సాగు చేసుకున్న అన్నదాతలు అంతరపంటగా ఇతర పంటలు సాగు చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట దిగుబడి వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. నాలుగు సంవత్సరాల అనంతరం సంవత్సరానికి ఆదాయం సుమారు లక్షా 20 వేల నుంచి లక్షా యాభై వేల వరకూ వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఎక్కువగా వస్తుందని అధికారులు ప్రచారం చేయడంతో అన్నదాతలలో కూడా ఈ సంవత్సరం ఆసక్తి పెరిగింది. అశ్వరావుపేట, దమ్మపేట కేంద్రాల్లో నర్సరీలలో పెంచుతున్న మొక్కలు పెంపకం రైతుల అవసరాలకు అనుగుణంగా జరగడంలేదని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీలను ఏర్పాటుచేసి అక్కడ పెంచాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రయత్నాలు ఎప్పటి వరకు విజయవంతం అవుతాయో తెలియటం లేదని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాతో పాటు అనేక జిల్లాలలో పామాయిల్ సాగు పై రైతన్నలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు రైతులు బాగా దష్టిసారించినట్లు అధికారులు అంటున్నారు. బోనకల్ మండలం లో పామాయిల్ సాగు పై రైతన్నలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ప్పటికీ అందుకు అనుగుణంగా ప్రచారం చేసిన విధంగా పామాయిల్ మొక్కలను రైతన్నలకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నారు. తమ ఆసక్తికి అనుగుణంగా పామాయిల్ మొక్కలను అందిస్తారా లేదా అని అన్నదాతలు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.