Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల టీఆర్ఎస్ పార్టీలో మెజారిటీ వర్గం మాజీ ఎంపీ పొంగులేటి వైపు చూస్తుందనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. పొంగులేటి ప్రబల్యం తగ్గించేందుకు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మంత్రితో కలిసి పావులుకదుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకేతాటిపై ఉంటూ ఎటువంటి వర్గాలు లేని ప్రశాంతంగా ఉన్న మండల పార్టీలో మంత్రి అనుచరుల పేరుతో నానా హడవుడి చేస్తూ పార్టీలో వర్గ విబేధాలకు ఆజ్యంపోస్తు మంత్రినే తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు మూడు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను తన చేతిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తు హంగామా చేస్తు తనమార్కు చూపిస్తున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మండలంలో సింహభాగం ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి వైపే ఉన్నారనేది విషయం అందరికీ తెలిసిందే. గతంలో తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు కూడా మండలంలో మెజార్టీగా ఉన్న నాయకులు, కార్యకర్తలు పొంగులేటిని అంటిపెట్టుకొని ఉన్నారు. నేటికీ మండలంలో అదే వాతావరణం కనిపిస్తుంది. మంత్రితో మండల పరిధిలోని లాలాపురం గ్రామంలో కావాలనే వరి వెదజల్లె కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా మాజీ ఎంపీ ముఖ్య అనుచరులు అయినటువంటి మండల పరిషత్ అద్యక్షుడు గోసు మధు (ఎంపీపీ), వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్లతోపాటు మరికొంతమంది అనుచరులను కొబ్బరికాయ కొట్టానీయకుండా పరాభవం కల్గించడంతో వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మండలంలో ఉన్న పొంగులేటి అనుచరులను పదవులనుంచి తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చాపకింద నీరులా జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు ఉన్న అద్యక ్షకార్యదర్శుల పదవులను నియోజకవర్గ వ్యాప్తంగా ఒకేసారి తొలగించారు. మండలంలో ఓ ప్రజాప్రతినిధి భర్త గ్రామాల్లో ద్వితీయ శ్రేణీనాయకులకు ఫోన్లు చేసి ''ఈసారి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీలను చేస్తాను నన్ను నమ్మండి జిల్లా ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ పదవులు ఇప్పిస్తా మీరంతా నాతోనే ఉండండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి బయటకురండి'' అంటూ పోన్ చేస్తూ వ్యక్తిగతంగా కలుస్తూ వర్గాలకు ఆజ్యంపోస్తున్నాడని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కావాలనే మండలంలో పొంగులేటి వర్గీయులను దూరం పెడుతున్నారా లేదా నియోజకవర్గంతోపాటు జిల్లాలో కూడా ఇదే విధంగా పొంగులేటి వర్గీయులను టార్గెట్ చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకేపార్టీలో ఉంటూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం అవసరమా అని పొంగులేటితో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు చెబుతునట్లు సమాచారం. గత రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ మండలంలో పర్యటించడంతో ప్రజాప్రతినిధులు నాయకుల్లో ఎనలేని సంతోషాన్ని కనబరిచింది. ఇకపోతే మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండువర్గాలుగా విడిపోయి పుట్టినరోజు వేడుకలు జరిపి మొక్కలు నాటారు. సోషల్ మీడియాలో రెండుగా విడిపోయిన టిఆర్ఎస్ పార్టీ....అంతకుముందు మండల టిఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా గ్రూపు ఉంది. ఆ గ్రూపులో ప్రతి రోజు నిర్వహించే పార్టీ కార్యక్రమాలు పోస్ట్ చేస్తూ గ్రామస్థాయిలో ఉండే నాయకులు కార్యకర్తలకు తెలియజేస్తూ ఉత్సహన్ని నింపేవారు. అయితే గతకొద్ది రోజులుగా మాజీ ఎంపీ వర్సెస్ మంత్రి అనుచరులతో పేరుతో ఒకరిపై ఒకరు మాటల దాడిచేసుకునే పరిస్థితి వచ్చింది. చివరకు ఒకటిగా ఉన్న టిఆర్ఎస్ మండల పార్టీ సోషల్ మీడియా గ్రూపు రెండుగ్రూపులుగా విడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది..