Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 ఏళ్లుగా దేశ రక్షణ, సమైక్యత కోసం అనేక త్యాగాలు
- మొక్కలు నాటండి ఆక్సిజన్ ను ఆస్తిగా ఇవ్వండి నినాదంతో ముందుకు
- నేడు ఇల్లందులో డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు
నవతెలంగాణ-ఇల్లందు
యువత పోరాట పతాక భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ మహాసభలు నేడు ఇల్లందు ఏలూరి భవన్లో జరగనున్నాయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నాటి పోరాట వారసత్వాన్ని డీివైఎఫ్ఐ కొనసాగిస్తోంది. 1980లో పంజాబ్ లోని లుధియానాలో నవంబర్ 1,2, 3 తేదీల్లో ఏర్పడి నాటి నుండి నేటి వరకు యువత, సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ఒక కోటి యాభై లక్షల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగింది. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని 40 ఏళ్లుగా దేశ రక్షణ, సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసింది డీవైఎఫ్ఐ. సమాజమంతా కాలుష్యం విస్తరిస్తున్న పరిస్థితుల్లో ''మొక్కలు నాటండి ఆక్సిజన్ ను ఆస్తిగా ఇవ్వండి'' అంటూ లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను డివైఎఫ్ఐ నిర్వహించింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. డీవైఎఫ్ఐ హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ మొదలుకొని బంధువులు కుటుంబ సభ్యులు సైతం కరోనాతో చనిపోయిన వ్యక్తి దగ్గరికి రాని దుర్భర పరిస్థితుల్లో అన్నీ తానై కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది. సామాజిక సేవలో మేము సైతం అంటూ రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, శ్రమదానాలు లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తోంది. అందరికీ విద్య, ఉపాధి కల్పన తోనే దేశ అభివృద్ధి సాధ్యమని డీవైఎఫ్ఐ భావిస్తోంది. తెలంగాణలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరియు ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగ భృతి ప్రకటనలకే పరిమితం అయిందే తప్ప మార్గదర్శకాలు లేవు. జిల్లాలో అపార ఖనిజ సంపద ఉన్నా పరిశ్రమల స్దాపనకు కృషి జరగలేదు. ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాలలో భూగర్బగనులు తీస్తామని ఉద్యోగావకాశాలు పెంచుతామని ఉద్యమ సమయంలో చెప్పిన ఉద్యమ నేత నేటి సిఎం కేసిఆర్ హామీని అటకెక్కించారు. ఓసిలు తీస్తూ పట్టణాలు నాశనం చేస్తున్నారు. ఇండ్లు కోల్బోవడమే కాకుండా ప్రజలు రోడ్డున పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఇలా యువత అనేక కష్టాలు పడుతోంది.
జిల్లాలోని యువజన సమస్యలపై భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఇల్లందులో జరగబోయే ద్వితీయ మహాసభలు వేదిక కానున్నాయి. కావున మహాసభలు జయప్రదానికి యువత మేదావులు అభ్యుదయవాదులు తమ సహకారాన్ని అందించి యువజన ఉద్యమానికి తోడ్పాటుని అందించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కి బారాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాలంగీ హరికృష్ణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వజ్జా సురేష్ విజ్ఞప్తి చేశారు.