Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు, డీసీఎంఎస్ డైరెక్టర్ దాట్ల వెంకట సత్యనారాయణ రాజు(67) బుధవారం తెల్లవారుజామున కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. కాటాయిగూడెం గ్రామానికి చెందిన డీవీఎస్ రాజుకు గత 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు అందించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.
డీవీఎస్ రాజు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ మండల అధ్యక్షుడిగా, కన్వీనర్‌గా పని చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనదైనశైలిలలో పరిష్కారం చేసేవారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ టిడిపి ప్రభుత్వ హయాంలో 1993 నుండి 1995 వరకు దుమ్ముగూడెం సహకార సంఘం అధ్యక్షులుగా, రెండవ సారి 16.02.2020లో అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి పిఏసిఎస్ అద్యక్షులుగా, డిసిఎంఎస్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం బాధ్యతల్లో కొనసాగుతున్న ఆయనను కరోనా మహమ్మారి బలి తీసుకుందనే చెప్పవచ్చు.
ఆయనకు భార్య లక్ష్మితో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. డీవీఎస్ మరణ వార్త తెలుసుకున్న కాటాయిగూడెం గ్రామస్తులతో పాటు మండల నలుమూల నుండి వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలి వచ్చారు. ఆయన మృతి తెలిసిన వెంటనే దుమ్ముగూడెం పిఏసిఎస్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. డివిఎస్ రాజు మృతదేహానికి భద్రాచలం స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొని కన్నీటీ వీడ్కోలు పలికారు. డివిఎస్ రాజు మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జీ తెల్లం వెంకట్రావ్‌తో పాటు పలువురు నాయకులు అన్నారు.