Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొసైటీలను కాజేసే యత్నాలను కేంద్రం విరమించుకోవాలి..
- సహకార వ్యవస్థతోనే రైతులు, వృత్తిదారులకు రక్షణ
- 'కేంద్ర వ్యవసాయ చట్టాలు...
- సహకార రంగ పరిరక్షణ'పై తెలంగాణ రైతుసంఘం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రాల పరిధిలోనే సహకార రంగం ఉండాలని...సహకార రంగాన్ని స్వాహాకారం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తిప్పికొట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన బుధవారం మంచికంటి భవన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని, సహకార రంగాన్ని రక్షించుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ కోరారు. 200 ఏళ్ల క్రితం దేశంలో సహకార వ్యవస్థ ఏర్పడిందన్నారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ సహకార చట్టాన్ని ఆమోదించారని తెలిపారు. సహకార వ్యవస్థను రాష్ట్రాల పరిధిలోకి తెచ్చి, బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టారన్నారు. ఆ తర్వాత సహకార రంగ విస్తరణకు అనేక కమిషన్లు, నిపుణుల కమిటీలు వేశారని తెలిపారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వ చేతిలోకి తీసుకుని పెత్తనం చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. సహకారరంగ బ్యాంకులు, సంస్థల్లో ఉన్న రూ.లక్షల కోట్ల మూలధనం, డిపాజిట్లు, లాభాలపై పెత్తనం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఈ కుటిల యత్నాలకు తెరదీసిందన్నారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌కు విరుద్ధమైన ఈ కుటిల యత్నాన్ని తిప్పికొట్టాలని రమేష్ పిలుపునిచ్చారు. సహకార బ్యాంకులతో పాటు వృత్తిదారులు, పీఏసీఎస్ కార్మికులు, ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, వినియోగదారులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సహకార రంగంలోకి తేబడ్డారని తెలిపారు. సహకార రంగంలోని సంస్థలను కంపెనీ యాక్టులోకి తెచ్చి ఈ రంగాన్ని బలహీనపర్చడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వ్యవసాయ, విద్యుత్ రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరహాలోనే సహకార రంగాన్నీ స్వాహాకారం చేయాలనే కుటిలయత్నాల్లో భాగంగానే కేంద్రం తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుందని ధ్వజమెత్తారు. గుజరాత్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థను దివాళా తీయించిన అమిత్‌షా ఇప్పుడు దేశవ్యాప్తంగా అవే విధానాలను ప్రవేశపెట్టి సహకార రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాజేసే సహకార చట్ట సవరణను వ్యతిరేకించాలి, నష్టాలలో ఉన్న సొసైటీలను ఆర్థికంగా ఆదుకోవాలి, రిజర్వ్‌బ్యాంక్ ఇన్సూరెన్స్ మినహా మిగిలిన అన్ని బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకోవాలి, 1964 చట్టాన్ని అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగుల్‌మీరా వందన సమర్పణతో సమావేశం ముగిసింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో రైతు, కూలీ సంఘం జిల్లా నాయకులు ఆవుల నాగేశ్వరరావు, రైతుసంఘం సీనియర్ నాయకులు, కలకొడిమ సొసైటీ మాజీ అధ్యక్షులు తాతా భాస్కర్‌రావు, లక్ష్మీపురం, నారాయణపురం, పెద్దబీరవల్లి, మోటమర్రి పీఏసీఎస్‌ల అధ్యక్షులు మాదినేని వీరభద్రం, నాగప్రసాద్, చింతలచెర్వు కోటేశ్వరరావు, బోజెడ్ల పుల్లారావు, లక్ష్మీపురం పీఏసీఎస్ వైస్ చైర్మన్ తుళ్లూరి రమేష్, ఏదులాపురం, వెంకటాయ పాలెం సొసైటీల డైరెక్టర్లు సింహాద్రి, బైరు నాగేశ్వరరావు, ఊరడి సుదర్శన్‌రెడ్డి పాల్గన్నారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, గొర్రెల మేకల సంఘం, డీవైఎఫ్ఐ, వృత్తిదారుల సంఘం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శులు కల్యాణం వెంకటేశ్వర్లు, సంగయ్య, మేకల నాగేశ్వరరావు, బషీర్, పగిడిపల్లి నాగేశ్వరరావు, నందిపాటి మనోహర్, ఆవాజ్ నాయకులు గౌస్, బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు మచ్చా రంగయ్య, కల్యాణం నాగేశ్వరరావు, గొర్రెల మేకల సంఘం జిల్లా అధ్యక్షులు బారి మల్సూర్ తదితరులు సంఘీభావం ప్రకటించారు