Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారంగా మారిన బడ్జెట్ స్కూల్స్ నిర్వహణ
- ఆన్లైన్ క్లాస్‌లపై ఆసక్తి చూపని విద్యార్థులు
- ఫీజుల చెల్లింపునకు తల్లిదండ్రుల విముఖత
- ఖమ్మం 322, భద్రాద్రి కొత్తగూడెంలో 207 ప్రైవేట్ పాఠశాలలు
- సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో యాజమాన్యాలు
కరోనా వ్యాప్తి నుంచి గత రెండేళ్లుగా పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో కొద్దిరోజుల పాటు తెరిసినా 20 రోజుల్లోనే మూతవేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ పతనావస్థలోకి నెట్టివేయబడ్డాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే బడ్జెట్ స్కూల్స్ నిర్వహణ భారంగా మారనుంది. ఆన్లైన్ క్లాస్‌లపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. కొద్దిమంది మాత్రమే ఆన్లైన్ క్లాస్‌ల ఫీజులు చెల్లిస్తున్నారు. కొందరైతే పుస్తకాలు కూడా తీసుకోవడం లేదు. ఫీజు చెల్లించడం లేదు, పుస్తకాలు కూడా కొనలేదనే కారణంతో జూమ్‌లో క్లాస్ వినేందుకు కావాల్సిన ఆన్లైన్ లింక్, పాస్వర్డ్ పంపకపోయినా కొందరు తల్లిదండ్రులు అడగడం లేదు. ఆన్లైన్ అవస్థలు పడలేక కొన్ని స్కూల్ యాజమాన్యాలు కరోనా లాక్డౌన్ నాటి నుంచి రెండేళ్లుగా మూసివేశారు. ఇక అద్దెభవనాల్లో నడిచే స్కూల్స్‌ను ఇప్పటికే ఎత్తివేశారు. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టి స్కూల్స్ పున్ణప్రారంభమైనా వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకునే అవకాశం లేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సంఘాలు వాపోతున్నాయి.
నవతెలంగాణ - ఖమ్మంప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న ప్రైవేట్ టీచర్స్‌లో సగానికి పైగా ఉపాధి కోల్పోయారు. సుమారు 35 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదారుగురు ప్రాణాలు వదిలారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లు భవన నిర్మాణ కార్మికులు, కూలీలుగా మారారు. తోపుడుబండ్లు, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నారు. అనేక ఆత్మహత్యల తర్వాత ప్రభుత్వం అరకొర సాయానికి ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2,000, 25 కేజీల బియ్యం చొప్పున కరోనా భృతి ఇస్తోంది.
పతనావస్థలో ప్రైవేట్ స్కూల్స్....
ఖమ్మం జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద మొత్తం 1,627 పాఠశాలలుండగా వీటిలో ప్రైవేట్ యాజమాన్యాల కింద 322 పాఠశాలలున్నాయి. వీటిలో ఎయిడెడ్ పాఠశాలు 24, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు 288, ప్రైవేట్ అన్ఎయిడెడ్ సీబీఎస్ఈ సిలబస్ పాఠశాలలు 10 ఉన్నాయి. 5,631 మంది ప్రైవేట్ స్కూల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో సగానికి పైగా ఉపాధి కోల్పోయారు. జిల్లా వ్యాప్తంగా 1.77 లక్షలకు పైగా విద్యార్థులుండగా 81వేల మందికి పైగా ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 207 ప్రయివేట్ పాఠశాలలు ఉండగా వీటిలో 4000 మంది వరకు పనిచేసేవారు వీరిలో అత్యధికులు ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మరలారు. వేల సంఖ్యలో ఆయా పాఠశాలల్లో ఉన్న బస్సులు శిథిలమయ్యాయి. కొన్ని స్కూల్ బస్సులను, స్కూల్స్‌ను అమ్మకానికి పెట్టినా ఎవరూ కొనేందుకు ముందురావట్లేదు. కొందరు పాఠశాలల్లోని ఫర్నీచర్‌ను అమ్ముకున్నారు. లీజ్‌ను రద్దు చేసుకున్నావారు మరికొందరున్నారు. ఖమ్మం నగరంలో 150కి పైగా ప్రైవేట్ పాఠశాలలుండగా 30లోపు పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంద వరకు ఉండగా పదుల సంఖ్యలో ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ బోధన చేస్తున్నాయి. 9, 10 తరగతుల మినహా మిగిలిన విద్యార్థుల విషయంలో పెద్దగా తల్లిదండ్రుల నుంచి పట్టింపు ఉండట్లేదని పాఠశాల నిర్వాహకులు అంటున్నారు. సగానికి పైగా విద్యార్థులు ఆన్లైన్ బోధన విషయంలో శ్రద్ధ పెట్టకపోవడంతో ఫీజులు కూడా అరకొరగా వస్తున్నాయి. కొద్దిపాటి విద్యార్థులు ఇచ్చే ఫీజులు పాఠశాల నిర్వహణకు సరిపోవడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఆన్లైన్ బోధన చేసే ఉపాధ్యాయులు సైతం అరకొర వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.