Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ వైపు కూంబిగ్, మరోవైపు స్మారక స్థూపంల కూల్చివేతలు
- ఏజెన్సీలో భయం భయం
నవతెలంగాణ-చర్ల
సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో దండకారణ్యం అంత యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అటు వారోత్సవాలు ఇటు కూల్చివేతలు మావోయిస్టు అమరవీరుల స్తూపాన్ని పోలీసులు ధ్వంసం చేసారు. మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ప్రారంభమైన రోజున భద్రతా బలగాలు దంతెవాడ జిల్లాలో భారీ స్తూపాన్ని కూల్చి వేశారు. 2017లో అమరులైన మావోయిస్టులు బిజే, పాలే పేరిట ఆరనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరుములా పారా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గతేడాది భారీ స్థూపాన్ని నిర్మించారు. స్తూపం వద్ద వారోత్సవ సంస్మరణ ఏర్పాట్లు చేపట్టగా, అటువైపుగా వెళ్లిన భద్రతా బలగాలు దాన్ని కూల్చివేశారు. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు. మావోయిస్టుల వారోత్సవాల తరుణంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. వారోత్సవాలను పకడ్బందీగా గ్రామగ్రామాన నిర్వహించాలని ఇప్పటికే మావోయిస్టులు పలుమార్లు పాత్రికేయులకు లేఖలు పంపడంతో పాటు భారీగా పోస్టర్లు, కరపత్రాలు బ్యానర్లు సైతం వదిలారు. కరోనా కారణంగా హరి భూషణ్ తో పాటు మరి కొందరు మావోయిస్టు ముఖ్య నేతలు మృతి చెందడంతో వారికి ఘనంగా నివాళులు అర్పించాలని, మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు గ్రామగ్రామాన భారీగా జరపాలని ప్రచారం చేస్తున్నారు. వారోత్సవాలను ఎలాగైనా తిప్పి కొట్టాలని భద్రతా బలగాలు సైతం భారీగా కూంబింగ్ నిర్వహిస్తూ కట్టుదిట్టం చేస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలల సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యం నుండి మావోయిస్టులు తెలంగాణలో చొరబడే అవకాశం ఉన్నందున అనుమానితులను కస్టడీలోకి తీసుకుంటున్నారు. పచ్చని పల్లెల్లో ఏ క్షణాన ఎటు నుండి ఏ తుపాకీ శబ్దం వినాల్సి ఉంటుందో అని, ఈ తుపాకీ గుండు దూసుకొస్తోంది అని క్షణక్షణం భయం భయంతో ఆదివాసీ గ్రామాలు అల్లాడుతున్నాయి.