Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- అఖిలపక్ష, గిరిజన, ప్రజా సంఘాల ''రౌండ్ టేబుల్ సమావేశం'' తీర్మానం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జిల స్మారకస్థూపం నిర్మాణాలను అధికారులు అడ్డుకుని కూల్చడాన్ని అఖిలపక్ష పార్టీలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ''రౌండ్ టేబుల్ సమావేశం'' తీవ్రంగా ఖండించింది. కూల్చిన స్థలంలోనే మాజీ ఎమ్మెల్యేల స్మారక స్థూపాల నిర్మాణం చేపట్టాలని, గిరిజన నేతల స్మారకస్థూపం నిర్మాణాలను అడ్డుకుని కూల్చిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ఎమ్మెల్యేలు, అమరవీరులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల చిత్రపటాలకు భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గిరిజన, గిరిజనేతర ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడి ఈ ప్రాంత అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యేలు కుంజా బోజ్జి, సున్నం రాజయ్యలు విశేష కృషి చేశారన్నారు. గిరిజన హక్కులు చట్టాల అమలు కోసం ఉద్యమించిన గిరిజన నేతల స్మారక స్తూప నిర్మాణాలను అడ్డుకొని కూల్చటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కె అజీమ్, ప్రాథమిక సహకార సమితి భద్రాచలం అధ్యక్షులు అభినేని శ్రీనివాస్, ఎన్డీ నాయకులు కెచ్చెల కల్పన, భద్రాద్రి ఆదివాసీ సంఘం నాయకులు పూనెం వీరభద్రం, రామ కృష్ణ, సత్యనారాయణ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, ఎం.బి.నరసారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు బి.కుసుమ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.