Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ చైర్మన్‌గా కొంటెముక్కల వెంకటేశ్వర్లు
- 14 మందితో పాలకవర్గం నియామకం
- తెలంగాణ వచ్చాక మూడోసారి కమిటీ
- ఏడాది కాలపరిమితితో కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్లలో రెండోదైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మూడో పాలకవర్గం ఏర్పాటు అయింది. 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌కావడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజరుకుమార్‌కు నమ్మినబంటులో ఒకడైన దూళి సాయికిరణ్ సతీమణి లక్ష్మీప్రసన్నను ఆ స్థానానికి ఎంపిక చేశారు. ఖమ్మంలోని చర్చికాంపౌండ్‌కు చెందిన లక్ష్మీప్రసన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారు. వైస్ చైర్మన్‌గా రఘునాథపాలెం మండలం కోటపాడు ఉపసర్పంచ్ కొంటెముక్కుల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 12 మందితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
పదిరోజులు ఆలస్యంగా పాలకవర్గం
రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మద్దులపల్లి మార్కెట్ ఏర్పాటుకు ముందు ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో విస్తరించి ఉన్న మార్కెట్ ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెంతో పాటు చింతకాని మండలాలతో కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాదికి ఒకసారి పాలకవర్గాన్ని నియమించాలనే నిర్ణయం పెట్టుకుంది. ఈమేరకు తొలుత ఆర్జేసీ కృష్ణ తొలి చైర్మన్‌గా ఏడాది కాలంపాటు కొనసాగారు. ఆ తర్వాత మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఈనెల 18వ తేదీ వరకు కొనసాగారు. వాస్తవానికి వీరి పదవీకాలం గతేడాది జూలై 18వ తేదీతోనే ముగిసినప్పటికీ ఆర్నెళ్లు ఆర్నెళ్ల చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడగించారు. ఈనెల 18వ తేదీతో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. మరోసారి పొడగించే అవకాశం లేకపోవడంతో అనివార్యంగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పదిరోజులు ఆలస్యంగా పాలకవర్గాన్ని ప్రకటించారు.
14 మందితో పాలకవర్గం
ఉమ్మడి జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు ఉండగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంలో చోటుకు తీవ్ర పోటీ ఉంటుంది. సుమారు రూ.2000 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం చైర్మన్, వైస్చైర్మన్లుగా లక్ష్మీప్రసన్న, వెంకటేశ్వర్లు ఎంపిక కాగా సభ్యులుగా నారపోగు నాగయ్య, అజ్మీర వెంకన్న, జంగాల శ్రీనివాసులు, షేక్ అబ్జల్, నాదెండ్ల భద్రయ్య, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పత్తిపాక రమేష్, దేవత అనిల్‌కుమార్, ఖమ్మం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ నాగరాజు, ఏడీఏ కిశోర్‌బాబు, మేయర్ పునుకొల్లు నీరజతో పాటు టేకులపల్లి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సభ్యులుగా పాలకవర్గం ఏర్పాటైంది. ఏడాది పాటు ఈ పాలకవర్గం కొనసాగుతుంది.