Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదురు తిరిగిన గిరిజనులు
- వాగ్వాదానికి దిగిన ఇరువర్గాలు
- దాడిచేశారని ఆరోపిస్తున్న అటవీ సిబ్బంది
- ఫోన్లలో పోడు రైతులను బెదిరిస్తున్న వైనం
- రేగళ్లపాడు పోడు భూముల్లో ఉద్రిక్తత
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం రేగళ్లపాడు పంచాయతీలోని పోడు భూముల వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 25 నుంచి 30 ఏండ్లుగా అక్కడి గిరిజనులు సుమారు 50 ఎకరాల్లో పోడు కొట్టుకుని జీడితోటలను వేసుకుని అందులో అంతర పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ యేడాది కూడా జీడితోటల్లో పత్తి వేసేందుకు గురువారం ఉదయం నాగళ్లను కట్టి దున్నే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి అటవీ సిబ్బంది సుమారు 10 మందికి పైగా అక్కడికి చేరుకుని దున్నుతున్న నాగళ్లను అడ్డుకున్నారు. దీంతో ఎదురు తిరిగిన పోడుసాగుదారులు, వారి భార్యలు అటవీ సిబ్బందిని నిలువరించారు. ఇరువర్గాల మధ్య సుమారు రెండుమూడు గంటల పాటు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. మహిళలను అటవీ సిబ్బంది నెట్టివేసే క్రమంలో క్రమంలో ఒకరినొకరు తోపులాట జరిగి మహిళల గాజులు పగిలి అటవీ సిబ్బందిలో ఇద్దరికి గుచ్చుకుని రక్తం రావడంతో పోడు రైతులు దాడిచేశారంటూ అటవీ సిబ్బంది చెప్పుకోవడమే గాక కొందరు సిబ్బంది మట్టి పొర్లాడి దాడిచేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా సత్తుపల్లి ఫారెస్ట్ అధికారి ఒకరు వ్యక్తిగతంగా పోడు రైతులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. మీరు మాకు ఎక్కడా దొరకరా.? అప్పుడు మీ సంగతి చూస్తామంటూ సదరు అధికారి గిరిజనులపై జులుం చూపిస్తున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 25 నుంచి 30 ఏండ్లుగా పోడుసాగు చేసుకుని జీవనం సాగిస్తున్న తమ భూములను సర్వే చేసి పట్టాలు ఇస్తామని గత 15 ఏండ్లుగా అటవీ అధికారులు అంటున్నారే తప్ప సర్వే చేసింది లేదని, పట్టాలిచ్చేది ఎప్పుడని వాపోతున్నారు. సత్తుపల్లికి వచ్చిన దగ్గర నుంచి అటవీ అధికారి నుంచి గిరిజన పోడు రైతులకు వేధింపులు ఎక్కువయ్యాయని పోడు రైతులు గంపా కేశవరావు, గంపా ప్రసాద్, బత్తుల సుగుణమ్మ, మడకం వెంకటేశ్, రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.