Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు ఇస్తాం.. కానీ సర్వీస్ రోడ్లు వేయాలి
- ఆర్డిఓ ఎదుట గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతుల డిమాండ్
నవతెలంగాణ- బోనకల్
ఒక రైతు చావనైనా చస్తాను గానీ భూమి మాత్రం ఇవ్వను అని అన్నాడు. కొంతమంది రైతులు సర్వీస్ రోడ్లు వేయాలని, మరికొంత మంది రైతులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఇంకొందరు భూమికి భూమి ఇవ్వాలని కోరారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రహదారి కోసం ఖమ్మం ఆర్డీవో మల్లాది వెంకట రవీంద్రనాథ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ఇంజనీర్లు రోజా, హేమంత్ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన కోలేటి జగన్నాథం తన పొలం మధ్యనుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పోతుందని, దీనివలన మిగిలిన పొలానికి దారి లేకుండా పోతుందన్నారు. తన పొలాలకు పోవటానికి మరోమార్గం లేదన్నారు. చావనైనా చస్తాను గానీ హైవే రోడ్డుకు మాత్రం భూమిని ఇవ్వనని ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కాడు. పెద్ద బీరవల్లి, బ్రాహ్మణపల్లి, తూటికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు ఇస్తామని కానీ తమ భూముల గుండా ఎక్స్ ప్రెస్ హైవే పోతుందని, దీని వలన మా పొలాలలోకి ఎలా వెళ్లాలని, మా పొలాలకు వెళ్ళటానికి అనుగుణంగా సర్వీస్ రోడ్లు వేయాలని కోరారు. మరికొంత మంది రైతులు రిజిస్ట్రేషన్ ధర ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వైరా- జగ్గయ్యపేట, వైరా - మధిర రహదారి పక్కనే తమ భూములు ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్ ధర 65 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉందన్నారు. అసైన్డ్, ఇనామ్ భూములు ఉన్నాయని తామందరం దళితులమేనని, భూమి కింద భూమి ఇవ్వాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించకుండా భూములను బలవంతంగా లాక్కోవద్దని కోరారు. రైతుల పక్షాన వారు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూమిని కోల్పోతున్న ప్రతి రైతుతో పేరు పేరునా పిలుస్తూ వారిచేత మాట్లాడించారు. ప్రతి రైతు అభిప్రాయాన్ని ఆర్డిఓ, ఇంజనీర్ రోజా నమోదు చేసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గత మూడు సంవత్సరముల నుంచి భూమి విలువను పరిశీలిస్తారని, ప్రస్తుత మార్కెట్ ధర, రిజిస్ట్రేషన్ ధరను పరిశీలించిన తర్వాతే నష్ట పరిహారం విలువ నిర్ణయిస్తారని తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎకరానికి 20 నుంచి 22 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. సర్వీస్, ఇంటర్నల్ రోడ్ల విషయాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులు తెలిపిన ప్రతి అభ్యంతరాలను, సమస్యలను వారికి వివరిస్తామని తెలిపారు. ఎస్సీ ,ఇనామ్ భూములను మాత్రం సమస్య పరిష్కారం అయిన తరువాత మాత్రమే తీసుకోవడం జరుగుతుం దన్నారు. ఈ సమావేశం కేవలం రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి మాత్రమేనని తెలిపారు. భూమికి ఎంత నష్టపరిహారం చెల్లిం చాలని విషయంపై మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో తాసిల్దార్ రావూరి రాధిక, ఆర్ఐ గుగులోతు లక్ష్మణ్, , గుంట్రూ సత్యనారాయణ, హైవే ఎక్స్ ప్రెస్ ఇంజనీర్లు షేక్ ఖాన్, షేక్ ఇసాక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్‌రావు, బ్రాహ్మణపల్లి, చిన్న బీరవల్లి, తూటికుంట్ల, పెద్ద బీరవల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.