Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినుకు కోసం రైతులు ఎదురు చూపులు
- వరి నాట్లు సాగక రైతులు ఇబ్బందులు
- పలు చోట్ల ఎండి పోతున్న వరి నారుమళ్లు
వానమ్మా..రావమ్మా అంటూ మండల రైతులు చినుకు కోసం గత వారం రోజులుగా ఆకాశంలో కదులుతున్న మేఘాల వైపు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వరుణ దేవుడు మాత్రం కర్షకుడి పట్ల కరుణ చూపడం లేదు. విపత్తులతో విల విల లాడే రైతులను కాలం ప్రతి ఏడు ఏదో రూపంలో ఇబ్బందులకు గురి చేస్తూ నష్టాల పాలు చేస్తూనే ఉంది.
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల రైతులు ఈ ఏడాది తొలకరి ప్రారంభం జూన్ నెల మొదటి వారం నుండి అడపాదడపా కురుస్తున్న వర్షాలకు సాగుకు సన్నద్దం అయ్యారు. ముందుగా దుక్కులు దున్నుతూ పత్తి సాగుకు సన్నద్దం కావడంతో పాటు అదునుగా పత్తి విత్తనాలు వేశారు. దీంతో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు పత్తి విత్తు కోవడంతో మొక్కలు మొలిచాయి. పత్తి చేలకుపై పాటు చేస్తూనే వరి సాగు కోసం పొడి, దమ్ము నార్లు పోశారు. ముందుగా రైతులు పలు గిరిజన గ్రామాలలో వర్షాభావంతో (ఆకాశపువాయల్లో) వేసే మూడు నెలల వరి పంట నాట్లు మొదలు పెట్టారు. గత పది రోజుల క్రితం వర్షాభావ పరిస్తితులు అనుకూలంగా ఉండడంతో గిరిజన రైతులు దమ్ములు చేస్తూ నాట్లు ముమ్మరం చేశారు. కాగా గత వారం రోజుల నుండి వర్షాలు మొఖం చాటేయడంతో పొలాల్లో నీరు లేక నాట్లు సాగడం లేదు. పలు చోట్ల దమ్ము చేసిన పంట పొలాలు సైతం ఎండి పోతున్నాయి. అక్కడక్కడా రైతులు వరి నాట్లు వేసేందుకు రహదారి వెంబడి బంటాలలో ఉన్న నీటిని ఇంజన్ల ద్వారా తోడుతూ నాట్లు వేస్తున్నారు. ఏది ఎమైనా వానమ్మా కరుణించి అదునుగా వర్షాలు పడితే మండలంలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతాయనే చెప్పవచ్చు.