Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణం ప్రాంతంలో కేటాయింపు
- నిరుపయోగం అంటున్న ప్రజానీకం
- మండల కేంద్రంలోనే ప్రయోజనం : ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
హరిత హారంలో భాగంగా పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ప్రతీ పల్లెల్లోనూ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయింది. ఇందుకోసం 8 నుండి 10 ఎకరాలు కేటాయించి అందులో ప్రజలు ఉదయం-సాయంత్రం నడవడంతో సేద తీరడం కోసం చిట్టడవులు పెంచాలి. ఇందుకోసం రెండేండ్ల నిర్వహణ కోసం గ్రామీణ ఉపాధి చట్టం నుండి రూ.30 లక్షలు ఖర్చు చేస్తారు. ఈ మేరకు జులైలో మొదటి వారంలో నిర్వహించిన హరిత హారంలో ఆర్డీఓ స్వర్ణలత మండల కేంద్రం దరిదాపుల్లో గల పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయం, పట్టు విత్తన పెంపకం కేంద్రం, మార్కెట్ యార్డ్ భవన సముదాయం ప్రాంగణాలను పరిశీలించారు. ఈ శాఖల అధికారుల నిరాకరణో లేక స్థలభావ పరిస్థితులో తెలియదు కానీ ఈ బీపీపీవీని మండల కేంద్రానికి 15 కి.మీ దూరంలో వినాయకపురం అటవీప్రాంతంలో ఏర్పాటుకు స్థలం కేటాయించారు. అయితే ఆ స్థలం తాము సాగు చేసుకునే నేల అంటూ కొందరు పేదలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఒక వేల ఆ స్థలం కేటాయించినప్పటికీ కనీసం 8 ఎకరాలు కూడా లేదని స్థానికులు వాదిస్తున్నారు. ఇక్కడే బీపీపీవి నిర్మిస్తే అది దుర్వినియోగమే అవుతుందని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. లక్షలాది ప్రజాధనంతో నిర్మించే ఈ వనాన్ని మండల కేంద్రంలో కానీ, సమీప పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు పేరు చెప్పడం ఇష్టం లేని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.