Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ పాల్వంచ
మైనార్టీ గురుకుల కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవటానికి గడువు తేదీని పెంచాలని మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.డి.యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావుకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 111 జూనియర్ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 840 లెక్చరర్ల పోస్టుల భర్తీకై ఆదివారం 01/8/2021 నోటిఫికేషన్ను విడుదల చేసి 02/8/2021 సోమవారం చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు ఇవ్వడంతో రాష్ట్రంలోని అనేక మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతారని కాబట్టి గడువు తేదీని కనీసం 15 రోజుల పాటు పొడిగించాలని కోరారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ గురుకుల కళాశాలల్లో తొలగించ బడిన ప్రిన్సిపాల్లకు ఈ నియామకాల్లో అవకాశాలు కల్పించాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్లతో పాటు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు యాకూబ్ పాషా విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి హుస్సేన్ ఖాన్, ఆసిఫ్, షకీల్, ఎండి గౌస్ పాషా పాల్గొన్నారు.