Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి రాంబాబు
నవతెలంగాణ-బోనకల్
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు విమర్శించారు. మండల కేంద్రంలో టియస్ యుటియఫ్ మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు కంభం. రమేష్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. పీఆర్సిలో పలు అసంబద్దతులున్నాయని, మాస్టర్ స్కేలును సవరించి ఉపాధ్యాయుల అందరికీ న్యాయం చేయాలని కోరారు. కేజీబీవీ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరారు. ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్న విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలతో పాఠశాలలో దశలవారీగా ప్రత్యక్ష బోధన విధానాన్ని ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎనిమిది ఏళ్ళ నుంచి అంతర్జిల్లా బదిలీలు చేపట్టకపోవడంతో భార్యాభర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షనరీ క్లైములు, జిపిఎఫ్, సెలవు జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పీపీఎస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు తదితర క్లైములన్నీ ఆరు నెలలుగా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి గూగులోతు రామకృష్ణ, ఆ సంఘం నాయకులు యంసిఆర్ చంద్రప్రసాద్, పి సుశీల, బి ప్రీతం, కె సౌభాగ్య లక్ష్మి ఆలస్యం. పుల్లారావు, పి.గోపాల్ రావు, కే శ్రీనివాసరావు, కె. రమేష్ పాల్గొన్నారు.