Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ డంప్ చేయాలో తెలియని అయోమయం
ఎక్కడికెళ్తే అక్కడ స్థానికుల నుంచి నిరసన
దానవాయిగూడెం తేవొద్దని స్థానికుల ఆందోళన
కామంచికల్‌లో 12 రోజులుగా నిరసన శిబిరం
రూ.కోట్ల చెత్తశుద్ధి మెషినరీ, నిర్మాణాలు వృథా
ఎక్కడపడితే అక్కడ డంప్ చేస్తున్న కార్పొరేషన్ సిబ్బంది
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నగరపాలక సంస్థ పాలకులకు చెత్తపై చిత్తశుద్ధి లేకపోవడంతో రఘునాథపాలెం మండలం కామంచికల్‌లో సుమారు 10 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ క్వారీల్లో 2017 నుంచి చెత్త డంపింగ్ చేస్తున్నారు. నగరంలోని 60 డివిజన్ల నుంచి రోజుకు 150 నుంచి 200 ట్రిప్పుల చెత్తను ఇక్కడికి తరలిస్తుండటంతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఐదు ఊళ్లు ముత్యాలగూడెం, పాటివారిగూడెం, కోయచెలక, రేగులచెలక, కోటపాడు గ్రామాల్లోని పదివేల మందికి పైగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసనతో సుమారు 400 ఎకరాల రైతులు సేద్యానికి దూరమయ్యారు. ఆయా గ్రామాల్లోని గాలి, నీరు కలుషితం అవుతుండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో 12 రోజులుగా కామంచికల్ గ్రామంలోని డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. చెత్త ట్రాక్టుర్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఐదు రోజుల తర్వాత నిరసన శిబిరాన్ని సందర్శించిన జడ్పీటీసీ వరప్రసాద్, ఎంపీపీ భర్త, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని తీసుకువచ్చి మరుసటిరోజే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లినా నేటివరకు అతీగతీలేదు.
దానవాయిగూడెంలోనూ నిరసన
కామంచికల్ పరిసర గ్రామస్తుల ఆందోళనతో చెత్త తరలింపు ఓ ఆరురోజుల పాటు నిలిచిపోయింది. నగరంలోని అపార్ట్మెంట్లు, ఇళ్లలో చెత్త పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో గతంలో డంపింగ్‌యార్డుగా ఉన్న దానవాయిగూడెంకు తరలిస్తున్నారు. ఒకటి, రెండురోజులు చూశాక ఇక్కడి ప్రజల నుంచీ నిరసన వ్యక్తమైంది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నగర పాలకసంస్థ పాలకులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయిస్తున్నారు. నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో సోమవారం పెద్ద ఎత్తున చెత్త డంప్ చేశారు. దుర్వాసన వస్తుండటంతో సీపీఐ(ఎం)టూ టౌన్ కార్యదర్శి విక్రమ్ ఆధ్వర్యంలో స్థానికులు కార్పొరేషన్ పాలకుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు కామంచికల్‌లో నిరసన శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సోమవారం సందర్శించారు. 'చెత్త' సమస్య పరిష్కారమయ్యే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు.
నిరుపయోగంగా నిర్మాణాలు, మెషిన్లు
ఖమ్మం మున్సిపాల్టీగా ఉన్నప్పటి నుంచి చెత్తను దానవాయిగూడెం తరలిస్తున్నారు. ఇప్పుడు నగరం విస్తరించింది. ఒకప్పుడు శివారులో ఉన్న డంపింగ్‌యార్డు ఇప్పుడు జనావాసాల మధ్యలో ఉంది. 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డంపింగ్ యార్డులో మూడేళ్ల క్రితం వర్మీ కంపోస్టు తయారీకి రూ.లక్షలు వెచ్చించి నాలుగు షెడ్లు నిర్మించారు. 15 డివిజన్లలో డీఆర్సీ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ వర్మీ కంపోస్టు తయారు చేసి నగరంలోని పార్కులు, చెట్లకు వినియోగించారు. తాజాగా రూ.1.32 కోట్లతో చెత్తను డంప్ యార్డుకు తరలించే ముందు కంప్రెస్ చేసేందుకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను నెలకొల్పారు. జూన్‌లో దీనిని మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభించారు. ఇందులో ఉన్న మెషీన్లలోకి చెత్తను డంప్ చేసి కంప్రెస్ చేయడం వల్ల దుర్వాసన రాదు. కానీ ఈ మెషీన్లు ప్రారంభమైన కొద్దిరోజుల నుంచే పనిచేయడం లేదు. ఫలితంగా తడి, పొడి చెత్తను వేరు చేయకుండా డంపింగ్‌యార్డుకు తరలించడం వల్ల దుర్వాసన వస్తుండటంంతో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇతర నగరాల్లో చెత్తను ప్రాసెస్ చేసి ఆదాయ వనరులుగా మలుచుకుంటుండగా ఖమ్మం కార్పొరేషన్లో ఆ ఆలోచనే చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
త్వరలో చెత్త సమస్యకు చక్కని పరిష్కారం చూపుతాం...
- పునుకొల్లు నీరజ,
మేయర్, నగర పాలక సంస్థ
నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్ల చెత్తను ఒకేచోట డంప్ చేయ కుండా నాలుగువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి తరలిం చాలనే యోచనలో ఉన్నాం. కానీ ఎక్కడ వేద్దామంటే అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రఘునాథపాలెం తరలిద్దామని ఇటీవల భావించాం. కానీ అక్కడి ప్రజలు వర్షపు నీరు గుట్టలపై నుంచి వచ్చి చెత్త తడిసి దుర్వాసన వస్తుందని వద్దంటున్నారు. రీసైక్లింగ్ యూనిట్లు నెలకొల్పాలని భావిస్తున్నాం. దానవాయిగూడెంలోని వర్మీ కంపోస్టు యూనిట్లు, మినీ ట్రాన్స్ఫర్ కేంద్రాలను సద్వినియోగం చేసుకుంటాం. త్వరలో చెత్త సమస్యకు చక్కని పరిష్కారం చూపుతాం.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చెత్త సమస్య
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఖమ్మంలో టన్నుల కొద్దీ వస్తున్న చెత్త రవాణాలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రహదారుల వెంట పడుతోంది. డంపింగ్ యార్డుల్లో రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు, నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. చెత్తను రీసైక్లింగ్ చేస్తే విద్యుత్, ఎరువు తయారవుతుంది. వర్షాలు వచ్చి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చెత్తవల్ల కాలుష్యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. వేసిన రోడ్డును ధ్వంసం చేసి మళ్లీ రోడ్డు నిర్మించినట్టు కాకుండా డంపింగ్ యార్డు నిర్వహణ కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలి. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా చెత్త సమస్యకు పరిష్కారం చూపక పోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. చెత్త సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు నిర్వహిస్తాం.