Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్‌లో కాంస్య పతకంపై శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు
- భారీ క్రెయిన్ సహాయంతో పెయింటింగ్‌కు స్వీట్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో అద్వితీయ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిన పీవీ సింధును అభినందిస్తూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆమెకు వాట్సప్‌లో పోస్టు పెట్టారు. అందుకు ఆమె ధన్యవాదాలు తెలుపుతూ తిరిగి పోస్టు చేశారు. త్వరలోనే ఖమ్మం రావాల్సిందిగా మంత్రి సింధును ఆహ్వానించారు. భారీ అభినందన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలోని బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంపై ఉన్న పీవీ సింధు పెయింటింగ్‌కు పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి భారీ క్రెయిన్ సహాయంతో స్వీట్ పెట్టారు. పీవీ సింధు సాధించిన విజయం పట్ల అభినందనలు తెలుపుతూ సోమవారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. 2016లో రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు, 2021 ఒలింపిక్స్‌లో టోక్యోలో కాంస్యంతో అదరగొట్టిందన్నారు. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత రెండో అథ్లెట్ సింధు అని తెలిపారు. సింధు విజయం ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. ఆమె ఇలాంటి విజయాలెన్నో సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోం దని, సర్దార్ పటేల్ స్టేడియంలో అన్ని వసతులు కల్పించామన్నారు. ప్రతి క్రీడాకారుడు ప్రత్యేక వసతులతో శిక్షణ పొందేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.