Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
కోయగూడెం ఓపెన్ కాస్ట్లో 2002 నుండి బొగ్గు వెలికితీత పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2001-02లో ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టుటకు ఫిట్3, ఫిట్2, ఫిట్1లు గావిభజించి ఫిట్3లో బొగ్గు వెలికితీత పనులు ప్రారంభించారు. ఫిట్3, ఫిట్2లలో బొగ్గు ఉత్పత్తి పూర్తయిన తర్వాత దానిని ఆరు మీటర్ల ఇసుకతో ఫీలింగ్ చేసి మట్టితో నింపాలని నిబంధనలు ఉన్నాయి. 6 మీటర్లు ఇసుక లేకుండా మట్టితో మాత్రమే నింపారు. కొన్ని మాత్రం అసలే నింపకుండా యధావిధిగా ఉన్నాయి. బొగ్గు వెలికితీసిన ప్రదేశం లోతుగా వెడల్పుగా ఉండడంతో రైతులకు చెందిన కొందరు పశువులు మేతకు వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు ఎన్నో కనబడుతున్నాయి. అధికారులు మాత్రం వాటిని ఆరు మీటర్ల ఇసుక ఫీలింగ్ చేసి మట్టి నింపే కార్యక్రమం చేయడం లేదు. దీనితో ఓపెన్ కాస్ట్‌కు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలకు చెందిన రైతుల పశువులు ఇంటి నుండి తప్పించుకొని ఓసి వైపు వెళ్తే తిరిగి ఆ పశువులు తిరిగి ఇంటికి వస్తాయా రావా అని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి అధికారులు స్పందించి బొగ్గు ఉత్పత్తి పూర్తయిన ప్రదేశాన్ని ఆరు మీటర్ల ఇసుక, మట్టితో నింపాలని సింగరేణి యాజమాన్యం కోరుతున్నారు. ఫిట్3కి సంబంధించిన సాగులో ఉన్న గిరిజన భూములను జాతీయ సంపద పేరుతో నయాపైసా నష్ట పరిహారం చెల్లించకుండా సింగరేణి యాజమాన్యం తీసుకున్న విషయం తెలిసిందే. సాగు చేసుకుంటున్న భూములు పోవడంతో అప్పటివరకు సుఖంగా ఉన్న గిరిపుత్రులు పాలేరుగా మిగిలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఫిట్2లో బొగ్గు వెలికితీత చేపట్టినప్పుడు భూ నిర్వాసితులు సీపీఐ(ఎం) అండతో ఉద్యమాలు చేసి పంట నష్టపరిహారం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం గిరిజనులకు అందజేసింది. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫిట్1లో భూములు కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం అందజేశారు. ఏది ఏమైనా బొగ్గు ఉత్పత్తి పూర్తయిన తర్వాత ఖాళీ ప్రదేశాన్ని ఆరు మీటర్ల ఇసుకతో నింపి, అనంతరం మట్టితో పూర్తిచేయాలని మండల ప్రజలు సింగరేణి యాజమాన్యంని డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ వల్ల దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్టు మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో టేకులపల్లిలో వైద్యశాల ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.