Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుంది
- కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టాలి
- జడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో సభ్యుల డిమాండ్
- గైర్హాజరైన అధికారులకు నోటీసులివ్వాలని చైర్మన్ ఆదేశాలు
- ఒలింపిక్ కాంస్య పతక విజేత సింధుకు అభినందనలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాలు సకాలంలో విడుదల చేయాలని జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. సాగర్ జలాలు వృథాగా పోతున్న ప్రస్తుత తరుణంలోనూ నీటిని సకాలంలో విడుదల చేయకపోవడాన్ని ఆక్షేపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ అధ్యక్షతన జడ్పీ స్థాయి సమావేశం సోమవారం జడ్పీ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ అద్వితీయమైన విజయాన్ని తెలుగు తేజం సింధు అందించిందని కొనియాడారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుందని, కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వైరా, కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోశారని...కొద్దిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో వరి నారు ఎండిపోతుందని పెనుబల్లి జడ్పీటీసీ సకినాల మోహన్‌రావు, కల్లూరు జడ్పీటీసీ కట్టా అజరుకుమార్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సాగర్ జలాలు వృథాగా పోతున్నా నీరివ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి ఎన్నెస్పీ అధికారులు సమాధానం ఇస్తూ...పాలేరు, కూసుమంచి పరిసరాల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్న దృష్ట్యా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు పూర్తవగానే నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఈ ఏడాది ఎన్నెస్పీ కాల్వల్లో పూడిక తీయలేదన్నారు. దీనివల్ల చెత్తాచెదారం పేరుకుపోయి నీరు సరిగా రావడం లేదని కారేపల్లి జడ్పీటీసీ జగన్ తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులను ప్రతిపాదనలు అడిగినా దానికి వారు స్పందించలేదని గ్రామీణ అభివృద్ధి శాఖ ఏపీడీ శిరీష ఆరోపించారు. ఐబీ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి అధికారులు సమన్వయం చేసుకుని, గ్రామపంచాయతీలో తీర్మానం చేసి కాల్వ పూడిక తీత పనులను ఎన్ఆర్ఈజీఎస్లో నిర్వహించాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు.కామేపల్లి, కారేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుందని ఆయా మండలాల జడ్పీటీసీలు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని డీపీవో ప్రభాకర్‌రావును ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు కృషి చేసిన వైద్యాధికారులు, సిబ్బందికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఆర్టీపీసీఆర్ వంటి టెస్టులు అందుబాటులోకి రావడం హర్షనీయమన్నారు. ఆర్టీసీ ఆర్ఎం, పశుసంవర్థకశాఖ అధికారులు సమావేశానికి గైర్హాజరవడాన్ని చైర్మన్ తీవ్రంగా పరిగణించారు. నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఐబీ డిప్యూటీ సీఈ శ్రీనివాస్, బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల అధికారులు జ్యోతి, సత్యనారాయణ, బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీలు పాల్గొన్నారు.