Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పని సరిగా పిసివి వ్యాక్సిన్ వేయించండి
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
చిన్నారులను న్యుమోనియా వ్యాధి నుండి రక్షించడానికి తప్పని సరిగా పిసివి వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కరోనా, పిసివి వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్య, రెవిన్యూ, డిఆర్డిఓ, జిల్లా సంక్షేమ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, విద్యా అధికారులతో జిల్లా టాస్పోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందచేయబడుతుందని, తప్పని సరిగా తల్లిదండ్రులు చిన్నారులకు వ్యాక్సిన్ ఇప్పించాలని చెప్పారు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో జరిగే అన్ని సమావేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియపై మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మెప్మా, మహిళా సంఘాల సమావేశాల్లో గ్రామస్థాయి వరకు సమాచారం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొదటి డోసు బిడ్డ పుట్టిన ఆరు నెలలకు, రెండవ డోసు 14 వారాలకు, బూస్టర్ డోస్ 9 నెలలకు 0.5 యం.ఎల్ ఇస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. ఈ వాక్సిన్ ఇవ్వడం వల్ల న్యుమోనియా నుండి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించబడినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఈఓ సోమశేఖర్ శర్మ, కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ సుజాత, సంక్షేమశాఖ సిడిపిఓ షబానా, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.