Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోన్నం. వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి షేక్ మీరాసాహేబ్, కార్మిక సంఘం జిల్లా నాయకులు పడిగేల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు, మూడు సంఘాల ఉమ్మడిగా కేంద్ర సహకార సంఘం బ్యాంకు అధ్యక్షులు కూరాకుల నాగభూషణంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర చరిత్రలో 1942 ఆగస్టు 9 ఒక చారిత్రక ప్రాధాన్యత సంతరిం చుకున్నదని , బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్విట్ఇండియా పిలుపునందుకొని వేలమంది జనం దేశ వ్యాప్తంగా విధుల్లోకి వచ్చారని, స్వాతంత్య్రం కోసం చావో రేవో తేల్చుకుందామని, వీరోచిత పోరాటాలు సిద్ధపడ్డారని, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించి సమరశీల పోరాటాలు సాగించిన ఫలితంగానే దేశ స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. 73 సంవత్సరాల తర్వాత కూడా శ్రమతో సంపదను సృష్టిస్తున్న కార్మికులు, రైతులు, ఇతర శ్రమ జీవులకు కష్టానికి తగిన ఫలితం రావడం లేదని, సరళీకరణ విధానాలు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాడుతున్న ప్రజలు, మేధావులు, ఉద్యమకారులపై తీవ్రమైన అణచివేత నిర్బంధం కొనసాగిస్తున్నారని, బ్రిటిష్ పాలకులను తలదన్నే విధంగా ఉపా, ఎన్ఐఏ లాంటి నల్ల చట్టాలతో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే స్తుందని, అందుకే మళ్లీ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ప్రతిఘటన పోరాటాలకు సన్నద్ధం కావాలని భారత దేశ వ్యాప్తంగా సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల అఖిలభారత కమిటీలు పిలుపునిచ్చాయి అని తెలిపారు. ఆరోగ్య రంగానికి నిధులు పెంచి ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగుపరచాలని, కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని, కోవిడ్ నియంత్రణలో ముందువరుసలో ఉండి పనిచేస్తున్న సిబ్బందికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ఆపాలని, సహజ వనరుల లూటీ నిలుపుదల చేయాలని, నిరంకుశ అత్యవసర సర్వీసులు చట్టం ఈడిఎస్ఓ రద్దు చేయాలని, డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ఇతర నిత్యావసర సరుకుల ధరలు అరికట్టాలని, ఆర్థిక స్వావలంబన సార్వభౌమత్వాలకు హానిచేసే దేశద్రోహ పూరిత విధానాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ జూలై 25వ తేదీ నుండి ఈనెల 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని, 9వ తేదీన భారత రక్షణ దినం పాటించాలని అఖిలభారత సంఘాలు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు