Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది రెవెన్యూ అధికారుల లీలలు
నవతెలంగాణ-బోనకల్
పట్టాదారు, పేరు ఒకరు పట్టాదారు పాస్ పుస్తకంలో మాత్రం ఫొటో, ఆధార్ నెంబర్ మరొకరిది. ఫొటో, ఆధార్ నెంబర్ తప్పుగా వచ్చిందని పరిష్కారం కోసం మూడేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. చివరకు కలెక్టర్ మీ సమస్య పరిష్కారం చేశారని కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవచ్చని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆ రైతు నా సమస్య పరిష్కారం అయిందని ఎంతో ఆనందంతో మీసేవ కేంద్రానికి వెళ్లి డౌన్లోడ్ చేసుకోగా మరొక తప్పు నమోదై ఉంది. సమస్య పరిష్కారం చేయకపోగా ఆ సమస్యతో పాటు రెవెన్యూ అధికారులు మరో కొత్త సమస్యను సృష్టించారు. దీంతో ఏం చేయాలో తోచక సదరు రైతు లబోదిబోమంటూ విలేకరులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన చిట్టూరి పిచ్చయ్యకు బోనకల్ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 192-193/ష2/2లో 1.17 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. ఈ భూమిని పిచ్చయ్య తన కుమారుడు నరేష్‌కి వారసత్వంగా ఇచ్చాడు. ప్రస్తుతం చింతకాని మండల కేంద్రంలో నివాసముంటున్న చిట్టూరి నరేష్ మరల ఇదే భూమిని తన కుమారుడైన తిష్య కేత్పేరుతో 2011లో రిజిస్ట్రేషన్ చేయించాడు. 2018లో పట్టాదారు పాస్ పుస్తకం (టీ26010150642) వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మాత్రం తిష్యకేతు పేరుతో వచ్చింది. కానీ అట్టి పాస్ బుక్ నందు ఆధార్ నెంబర్, ఫొటో తప్పుగా వచ్చినవి. విషయాన్ని రైతు తండ్రి నరేష్ పట్టాదారు పాస్ పుస్తకం తప్పుల తడకగా వచ్చిందని సరిచేయాలని బోనకల్ తహసీల్దార్, వీఆర్ఓల చుట్టూ 2018 సంవత్సరం నుంచి ఎన్నోసార్లు తిరిగారు. నరేష్ సమస్యను సరిచేయాలని దరఖాస్తు చేసినా ఆధార్ నెంబర్, ఫొటో సరి చేయలేదు. 2018 నుంచి 2020 వానాకాలం పంట వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు నిధులు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం నవంబర్‌లో ధరణి వచ్చిన దగ్గరనుంచి ఆన్ లైన్లో చిట్టూరి తిష్యకేత్ బదులుగా బోనకల్ గ్రామానికి చెందిన బొమ్మకంటి తేజన్వేష్ తండ్రి అనంత రంగారావు పేరుతో వస్తుంది. ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్య రావటంతో మరలా నరేష్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసే విధానం చెప్పారు. దీంతో నరేష్ 10 జూన్ 2021న ధరణి వెబ్సైట్లో ఆధార్ మిస్ మ్యాచ్ ఆప్షన్ నందు మీ సేవ కేంద్రము నందు ( దరఖాస్తు నెంబర్ 163873000010564 ) దరఖాస్తు చేశాడు. దరఖాస్తు చేసిన కొంతకాలం తర్వాత బోనకల్ తాసిల్దార్ కార్యాలయం నుంచి నరేష్ కి ఫోన్ చేశారు. దీంతో నరేష్ పొలానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తాసిల్దార్, విఆర్ఓకు అందజేశారు. 26 జూన్ 2021న మీ సమస్య జిల్లా కలెక్టర్ పరిష్కరించారు.నూతన పాస్ బుక్ నెంబర్ టి26010150636 తో డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్ వచ్చింది. దీంతో సదరు రైతు ఆనందంతో మీసేవ కేంద్రానికి ఆగ మేఘాల మీద వెళ్లి నూతన పాస్ బుక్ నెంబర్లు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగా ధరణి వెబ్ సైట్ నుంచి నూతన పాస్ బుక్ డౌన్ లోడ్ అయింది. దీంతో సోదర రైతు పాస్ బుక్‌లో చూడగా ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా మరో కొత్త సమస్య వచ్చి పడింది. తిష్యకేత్కు చెందిన సర్వే నెంబర్ 192-193/ష2/2లోని 1.17 ఎకరాల లతోపాటు సర్వే నెంబర్ 141/1లోఎ 4.35 ఎకరాలతో మొత్తం 6.1200 ఎకరాలు బొమ్మకంటి తేజ్ అన్వేష్ తండ్రి అనంత రంగారావు పేరుతో పాస్ బుక్ లో ఉంది. ఈ పాస్ బుక్ లో ఫోటో, ఆధార్ నెంబర్ తిష్య కేత్ ది కాగా పేరు మాత్రం బొమ్మకంటి తేజ్ అన్వేష్ ది ఉంది. ఉన్న నాలుకకు మందు వేస్తే కొండ నాలుక ఊడిపోయిన చందంగా రెవెన్యూ అధికారుల పని తీరు ఉంది. దీంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు.