Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా, పెనుబల్లి మండల తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, వైద్యాధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా మండల స్థాయి టాస్క్ ఫోర్స్ బందం నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు., మాస్క్ లు ధరించని వారిపై జరిమానాలు విధించాలన్నారు. వారంలో రెండు రోజులు తప్పనిసరిగా మండల స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారుల సమావేశాలు నిర్వహించాలన్నారు. పరిస్థితిని సమీక్షించుకోవాలని, పాజిటివ్ పేషెంట్లను తప్పనిసరిగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని అరికటడంలో నిర్లక్ష్య ధోరణి సరికాదని, మండల స్థాయి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా, పెనుబల్లి మండలాలలో కరోనా ప్రబలుతున్న కారణాలను గుర్తించి కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. లక్షణాలు ఉన్న వారందరికీ టెస్టులు చేయాలని, హైరిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. టెస్టింగ్ తో పాటు వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా తగు చర్యలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలోనే తప్పనిసరిగా పాజిటివ్ పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలన్నారు. ఐసోలేషన్ కేంద్రాల వద్ద వి.ఆర్.ఏ, వి.ఆర్.ఓ సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రామాలలో జరిగే జనసమూహ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో పరిస్థితులను బట్టి స్థానికంగా లాక్డౌన్ ను అమలు చేయాలన్నారు. ముందస్తు నియంత్రణ చర్యల వల్లనే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టగలుగుతామన్నారు. మండలస్థాయి టాస్క్ఫోర్స్ అధికారుల బందం నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా?బి. వెంకటేశ్వర్లు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా రాజేష్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, ఇంచార్జ్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. శ్రీరామ్, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, వైద్యాధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.