Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారుల కోసమే హైవే ఎక్స్ప్రెస్ నిర్మాణాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ- బోనకల్
కేసీఆర్ వాసాలమర్రి పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని,దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, రైతుల పొట్ట కొట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే రైతుల భూముల నుంచి హైవే ఎక్స్ ప్రెస్ నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. పెద్ద బీరవల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ మహాసభ మాజీ ఎంపిటిసి కర్లకుంట ముత్తయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగింది. తొలుత మహాసభ ప్రారంభ సూచకంగా సిపిఎం సీనియర్ నాయకులు యనమద్ది సత్యనారాయణ సిపిఎం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో పోతినేని రైతుబంధు వల్ల రైతులు అభివృద్ధి చెందుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించకుండా రైతుల అభివృద్ధి జరగదన్నారు. ఎక్స్ ప్రెస్ హైవేలు పెట్టుబడిదారుల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. కరోనాను కమ్యూనిస్టు దేశాలు అరికట్ట కలిగినప్పుడు పెట్టుబడిదారీ దేశాలు ఎందుకు అరికట్టలేక పోయాయని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగటం, నిరుద్యోగం విలయతాండవం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఓ ప్రైవేటు పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఐసోలేషన్ కేంద్రాన్ని తొలగించటానికి అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఐసోలేషన్ కేంద్రం అనుమతి కోసం కలెక్టర్ వద్దకు వెళితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారని, మీరు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి కరోనా బాధితులు రారని మేము ఏర్పాటు చేసే ఐసోలేషన్ కేంద్రానికి కరోనా బాధితులు వస్తారని అని స్పష్టం చేశామన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసోలేషన్ కేంద్రంలో 203 మందిని పూర్తి ఆరోగ్యవంతంగా చేసి తమ ఇళ్లకు పంపించామని తెలిపారు. అనంతరం పెద్దబీరవల్లి సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకుడు పెదప్రోలు కోటేశ్వరరావు ఎన్నికయ్యాడు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతల చెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వర రావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సీపీఎం మండల కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సునీత, సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, కర్లకుంట్ల దేవమని, చల్లగుండ్ల రామనర్సయ్య, ఆళ్ల హనుమంతరావు, ఆళ్ల ప్రసాద్, మిర్యాల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.