Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ కార్మికుల, మున్సిపాలిటీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్విహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని పర్మినెంట్ చేయాలని నినాదాలతో హౌరెత్తించారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓ గన్యాకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీపీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజె.రమేశ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులు కోవిడ్ తదితర అత్యవసర ఆరోగ్య. సంక్షోభాలు వచ్చినప్పుడు ముందు వరుసలో నిలబడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారని, తక్కువ వేతనాలు పొందుతూ ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న వీరి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కీం వర్కర్స్ అందరికీ పీఆర్సి ప్రకటించి మున్సిపాలిటీ పంచాయతీ కార్మికులను విస్మరించిందన్నారు. జూన్ 27వ తేదీన దళిత సాధికారిక సమావేశంలో పీఆర్సి తరహాలో నిర్ణయాత్మకమైన వేతన విధానాన్ని రూపొందిస్తామని, భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెల దాటుతున్న ఇంతవరకు వీరికి పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు కనీస వేతనం రూ.24 వేలు ఈ నెల నుంచే చెల్లించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రతినెలా 5 వతారీఖు లోపు వేతనాలు చెల్లించాలని, ఆగస్ట్ 9 తేదీ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ దినంను జయప్రదం చేయాలని, ఆగస్టు 20వ తేదీ చలో హుజురాబాద్ శంఖారావం సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యంవి.అప్పారావు, కోశాధికారి జి.పద్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్. గంగయ్య, చారి, కాపు రవి, కృష్ణ, ఈరియా నాయక్, రామ్ కుమార్, సీతారాములు, నరసింహారావు, రంగా, విజయ, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.