Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2684 మంది అభ్యర్థులకు గాను 2297 మంది హాజరు
- పరీక్షల నిర్వహణను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్ బలరాం
నవతెలంగాణ-కొత్తగూడెం
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సింగరేణిలో ఫిట్టర్ ట్రైనీ (ఎక్స్ట్ర్నల్) ఉద్యోగాలకు రాత పరీక్ష జరిగింది. ఆదివారం 5 పరీక్షా కేంద్రాల్లో వేలాది మంది పరీక్షలు రాశారు. కొత్తగూడెం పట్టణంలోని 4 పరీక్ష కేంద్రాలు, సుజాతనగర్ మండలం లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఒక పరీక్ష కేంద్రంతో కలిపి 5 పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, మెటల్ డిటెక్టర్ల సహకారంతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 128 ఫిట్టర్ ట్రైనీ పోస్టులకు పరీక్ష జరిగింది. మొత్తం 2684 మంది అభ్యర్థుల సంస్థ కాల్ లెటర్స్ జారీ చేయగా, 2297 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద అత్యధికమైన రాపిస్కాన్ మిషన్ అండ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను సింగరేణి సంస్థ డైరెక్టర్(పా) ఎన్.బలరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదని తెలిపారు. పాదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షా ఫలితాలను ఆదివారం సాయంత్రం నుండి సింగరేణి వెబ్సైట్లో పొందు పరిచినట్లు తెలిపారు. మణుగూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డారని అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలిపారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న అతనిపై శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. భవిష్యత్‌లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం పర్సనల్ అందెల ఆనందరావు, జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య, జిఎం సెక్యూరిటీ ఏ.కుమార్ రెడ్డి, జిఎం విజిలెన్స్ వి.చంద్రశేఖర్, ఇతర అధికారులు రామ్‌కుమార్, బిఆర్.దీక్షితులు, కళాశాల ప్రిన్సిపాల్ చింతా శారద తదితరులు పాల్గొన్నారు.