Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండల పరిధిలోని ఆళ్లపాడు రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభంతో బోనకల్లు అన్నదాతలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. బోనకల్ అన్నదాతల పొలాలు మొత్తం ఆళ్లపాడు రైల్వే గేటు అవతల ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లాలంటే ఆళ్లపాడు రైల్వే గేటు దాటి వెళ్లాల్సిందే. ప్రత్యామ్నాయ రహదారి సౌకర్యం కల్పించకుండా అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు రైల్వే అధికారులు పనులు ప్రారంభించడం పట్ల బోనకల్ అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోనకల్ అన్నదాతలు తమ పొలాలకు వెళ్లే రహదారి సౌకర్యం లేకపోవడంతో అయోమయంలో పడిపోయారు. బోనకల్లు అన్నదాతలు తమ పొలాలకు వెళ్లాలంటే రావినూతల మీదుగా బైపాస్ నుంచి మరల ఆళ్ల పాడు రైల్వే గేట్ దగ్గరకు రావాల్సిందే. ఆళ్లపాడు రోడ్డు ఎక్కి అక్కడ నుంచి రైతులు ఎప్పటిలాగానే తమ పొలాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. బోనకల్ అన్నదాతలు రావినూతల మీదుగా బైపాస్ రోడ్డు ద్వారా ఆళ్ల పాడు రోడ్డు కు తిరిగి రావాలంటే ఐదు కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి ఉంది. రైతులు తమ పొలాలకు అరక లతో వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. ఇంత దూరం అరకలతో ఎలా వెళ్లాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పంట పాటు చేసే సమయమని, ఇటువంటి సమయంలో తమ పొలాలకు ఎలా వెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆళ్లపాడు రోడ్డు ద్వారా మోటమర్రి ,రాయన్నపేట, ఆళ్లపాడు, గోవిందపురం ఏ గ్రామాల ప్రజలు మండల కేంద్రం బోనకల్ రావాలంటే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాలిసిందే. రాయన్న పేట నుంచి బోనకల్లు రావాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండగా రావినూతల బైపాస్ ద్వారా బోనకల్ మండల కేంద్రానికి రావాలంటే ప్రస్తుతం 5 కిలోమీటర్లు అదనంగా వస్తుంది. ఆళ్లపాడు నుంచి బోనకల్ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్లు దూరం ఉండగా ప్రస్తుతం అదనంగా రావినూతల బైపాస్ నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. రావినూతల బైపాస్ రోడ్డును మండల కేంద్రంలో ఆరో బి బ్రిడ్జి నిర్మాణ సమయంలో వేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు పెద్ద పెద్ద గుంతలతో అత్యంత దారుణంగా ప్రమాదకరంగా తయారయింది. ఇటువంటి సమయంలో నాలుగు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే కత్తి మీద సాములా గానే ఉంటుంది. రావినూతల బైపాస్ రోడ్డు మంచిగా ఉందా అంటే అది లేదు ఈ బైపాస్ గుండా వెళ్లాలంటే ఉన్నది రెండు కిలోమీటర్ల అయినా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్లే ఎంత సమయం పడుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్లిన వాహనాలు నాలుగైదుసార్లు ప్రయాణిస్తే టైర్లు, ట్యూబులు పనికి రాకుండా పోతాయి. అంత దారుణంగా బైపాస్ రోడ్డు ఉంది. ఇన్ని సమస్యలు ఎదురు అవుతుండగా ఈ సమస్యల పరిష్కారం చేయకుండా నేరుగా అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఏకంగా చేపట్టటం పలు సమస్యలకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు నాలుగు గ్రామాల ప్రజలు మరొకవైపు రైతులు, వ్యవసాయ కార్మికులు అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రహదారి సౌకర్యం కల్పించిన తర్వాతనే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని రైతులు రైల్వే అధికారులను ముక్త కంఠంతో కోరుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు చేపడితే ఆ నిర్మాణ పనులు అవసరమైతే అడ్డుకుంటామని కూడా బోనకల్ అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. వదలమంటే పాముకి కోపం కరవమంటే కప్పకి కోపం లాగా ఆళ్లపాడు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఉన్నాయి.