Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
నాలుగు నెలలుగా మిషన్ భగీరథ కార్మికులకు జీతాలు బంద్ అయ్యాయి. దీంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధిర నియోజకవర్గంలో తాగునీరు అందించడానికి ఆనాటి మధిర ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు కృషితో వైరా రిజర్వాయర్‌పై సుజల స్రవంతి పథకాన్ని నిర్మించారు. ఆ పథకం ద్వారా మధిర నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగింది. ఆ సమయంలోనే సుమారు 20 సంవత్సరాల క్రితం తాగునీటి సరఫరా చేసేందుకు కార్మికులను నియమించారు. అదే కార్మికులు ప్రస్తుతం పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పథకాన్ని మిషన్ భగీరథ పథకంగా మార్చారు. దీని నిర్వహణను ఎల్‌అండ్‌టి సంస్థకు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. బోనకల్ మండలంలో మిషన్ భగీరథ పథకంలో మండల వ్యాప్తంగా 23 మంది కార్మికులు పని చస్తున్నారు. మధిర క్రాస్ రోడ్డు వద్ద ఇద్దరూ రాపల్లి బీపీటీ వద్ద ఇద్దరు గార్లపాడు బిపిటీ వద్ద ఇద్దరు బోనకల్ బీపీటీ వద్ద ఇద్దరు చొప్పున కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ముష్టికుంట్లలో ఒకరు, చొప్పకట్లపాలెం, చిరునోములలో ఒకరు బోనకల్ మండల కేంద్రంలో ఒకరు, ఆళ్లపాడు, గోవిందాపురంలో ఒకరు, రాయన్నపేట, మోటమర్రిలో ఒకరు, కలకోట, బ్రాహ్మణపల్లిలో ఒకరు, చిన్న బీరవల్లి, జానకిపురం, నారాయణపురంలో ఒకరు, పెద్ద బీరవల్లిలో ఒకరు, లక్ష్మీపురం, గోవిందాపురంలో ఒకరు, రామాపురం, గార్లపాడు ఒకరు మెయిన్ పైప్ లైన్ మీద ఒకరు మొబైల్ గ్యాంగ్‌లో నలుగురు చొప్పున కార్మికులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. 23 మందికి ఎల్ అండ్ టి సంస్థ ఏప్రిల్ నెల నుంచి జీతాలు చెల్లించడం లేదు. జీతాల కోసం కార్మికులు అడుగుతుంటే బోనకల్లు మండలం మిషన్ భగీరథ సూపర్వైజర్ రేపు మాపు అంటూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కంటే ముందు కార్మికులం దరూ సీఐటీయూ కార్మిక అనుబంధ సంఘం లో కొనసాగారు. ఎల్ అండ్ టీ సంస్థ చేతిలోకి మిషన్ భగీరథ పథకం నిర్వహణ వెళ్ళటంతో కార్మికులకు జీతాలు చెల్లించటంలో సంస్థ ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకుడు జిల్లా వ్యాప్తంగా గల కార్మికులందరినీ బస్సులో హైదరాబాదు ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్మిక సంఘమైన టిఆర్ఎస్ కె.వి సంఘంలో అందరినీ చేర్పించారు. ప్రస్తుతం కార్మికుల పరిస్థితి జీతాల కోసం నిలదీసి, పోరాడే పరిస్థితి లేకుండా పోయిందని, వాళ్లు ఇచ్చినప్పుడే తీసుకునే పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు సంఘంలో ఉన్నప్పుడు పోరాటం చేస్తామని భయంతో జీతాలు వెంటనే ఇచ్చే వాళ్ళని, ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి జీతాల కోసం తిరుగుతూనే ఉన్నామని ఆయన జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.