Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
పంటల సాగుకోసం అరకొర సాగునీటి సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండలంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సుమారు 33,200ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇటీవల పడిన వర్షాలకు 21వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి చేయగా మిగిలిన ఎకరాల్లో కూడా వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే వర్షాలు పడక దాదాపు పదిహేను రోజులు పైగా కావొస్తుండటంతో వరి నాట్లు సాగునీరులేక నిలిచిపోయాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈనెల నాలుగోతేదీన పాలేరు రిజర్వాయర్ వద్ద సాగునీరు విడుదల చేశారు. తొలిరోజు 600 క్యూసెక్కులను విడుదల చేయగా ఆదివారం 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పాలేరు జలాలు కల్లూరుకి శనివారం వచ్చాయి. కప్పల బంధం రెగ్యులేటర్ వద్దకు కేవలం 600 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతున్నాయి. అందులో 390 క్కూసెక్కులు సాగునీరు సరఫరా చేస్తున్నారు. కప్పల బంధం రెగ్యులేటర్లు దిగువకు 210 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. సుమారు పన్నెండు వేల ఎకరాలకుపైగా నాట్లు వేయాల్సి ఉండగా నాట్లు వేసిన పొలాలకు పులక తడికి నీరు అవసరం ఉంది. ఈ సమయంలో కనీసం మదిర బ్రాంచీకి వెయి క్యూసెక్కులు సరఫరా చేస్తేనే ఆయకట్టు చివరి వరకు సాగు నీరు పొలాలకు అందే అవకాశం ఉంది. సాగర్ జలాలు వస్తే నీటి కొరత ఉండదని, పొలాలన్నీ సకాలంలో నాట్లు పడతాయని రైతన్నలు ఆశపడ్డారు. సాగునీరు విడుదల చేసి నాలుగు రోజులు కావొస్తుండగా సాగునీటి సరఫరాను పూర్తిస్థాయిలో పెంచకపోవడంతో రైతులు ఇబ్బందులు పడక తప్పట్లేదు. వెంటనే 4000 క్యూసెక్కుల నీటిని పాలేరు రిజర్వాయర్ వద్ద విడుదల చేసి మదిర బ్రాంచికి వెయ్యి క్యూసెక్కుల నీరు సరఫరా చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జనవనరుల శాఖ డిఈఈ రాజా రత్నాకర్‌ను వివరణ కోరగా మదిర బ్రాంచీకి ఎనిమిది వందల క్యూసెక్కులు నీరు అవసరం ఉందని జిల్లాకు సమాచారం పంపామని, నీటి సరఫరా పెరగ్గానే మధిర బ్రాంచికి నీటి సరఫరా పెంచుతామన్నారు.